విదేశాల్లో తెలంగాణ వాసులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణమే స్పందించే విధంగా... ప్రత్యేకాధికారుల బృందం అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. అక్కడ నివసిస్తున్న రాష్ట్ర వాసుల కోసం అమలు చేయాల్సిన ప్రణాళికపై సీఎస్ సోమేశ్ కుమార్, విదేశాంగ మంత్రిత్వశాఖ ఓఎస్డీ రాజశేఖర్, ఇతర అధికారులతో సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు.
తెలంగాణ వాసులు గల్ఫ్‌లో ఏ కారణంతో అయినా చనిపోతే వారి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు... ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, చారిత్రక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందించాలని... పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణకు సహకరించాలని అన్నారు.