తెలంగాణ

telangana

ETV Bharat / state

వారం వారం వంటింటి మంట..

వంట గ్యాస్‌ ధరలు మరింత మండనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ ధరల ఆధారంగా దేశంలో కూడా గ్యాస్‌ ధరలో మార్పులు, చేర్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

వంటింటి మంట.. వారం వారం!
వంటింటి మంట.. వారం వారం!

By

Published : Feb 9, 2021, 7:51 AM IST

ప్రస్తుతం అంతర్జాతీయ ధరల ఆధారంగా పెట్రోలు, డీజిల్‌ ధరలను రోజువారీ మార్చుతున్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగున్నరేళ్ల నుంచి ఈ విధానం అమల్లో ఉంది. గ్యాస్‌ ధరలు కూడా ఇలాగే అంతర్జాతీయంగా రోజువారీ మారుతుంటాయి అందుకే ఇక్కడా అదే విధానం అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. తొలిదశలో ప్రతి 15 రోజులకు ఒకసారి మార్చటమా? లేక వారానికి ఒకసారి మార్చాలా? అనే అంశాన్ని పరిశీలిస్తోంది. గత ఏడాది డిసెంబరులో రెండు దఫాలుగా వంట గ్యాస్‌ ధరలను పెంచింది. గృహావసరాలకు వినియోగించే సిలిండరు ధర రూ. 100 వరకు పెరిగింది. వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. అయినా ప్రజల నుంచి పెద్దగా నిరసనలు రాకపోవటంతో గ్యాస్‌ విషయంలో కూడా సాధ్యమైనంత త్వరితంగా రోజువారీ విధానం అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ నుంచి జులైలోగా ఇది కార్యరూపంలోకి వచ్చే అవకాశముందని సమాచారం.

తొలిదశలో 15 రోజులకోసారి!

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ప్రతి నెలా మొదటివారంలో అంతర్జాతీయ ధరల ఆధారంగా వంట గ్యాస్‌ ధరలను పెంచుతోంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి, ఆ తర్వాత వారానికి ఒకసారి మార్చటం ద్వారా గ్యాస్‌పై నష్టాన్ని పూడ్చుకోవాలన్నది ప్రభుత్వ యోచన అని పెట్రోలియం మంత్రిత్వ శాఖవర్గాల ద్వారా తెలిసింది. ఎప్పటి నుంచి అమలు చేయాలన్నది ఇంకా ఖరారు కాలేదని ఓ అధికారి ‘ఈనాడు’తో చెప్పారు. పెట్రోలు, డీజిల్‌ ధరల విషయంలో ప్రభుత్వం ఇదే విధానాన్ని అమలు చేసిందని చెప్పారు. మొదట 15 రోజులకు ఒకసారి పెంచింది. తర్వాత దాన్ని వారానికి కుదించింది. ఆపై రోజువారీగా ధరలు మారుతున్నాయి. వంట గ్యాస్‌ ధరలను అంతర్జాతీయ మార్కెట్‌ ఆధారంగా మార్చాల్సి వస్తుందని గతంలోనే పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటించిందని గుర్తు చేశారు.

రోజుకో ధర అయితే ఎలా?

గ్యాస్‌ ధరల విషయంలో రోజువారీ మార్పులు గందరగోళాన్ని సృష్టిస్తాయి. తరచుగా ధర మారిస్తే ఇటు వినియోగదారులకు, అటు డీలర్ల మధ్య అయోమయం నెలకొంటుంది. చమురు ఎప్పటికప్పుడే డెలివరీ అవుతుంది. వంట గ్యాస్‌ విషయంలో బుక్‌ చేసే రోజు ఒక ధర, డెలివరీ రోజు మరో ధర. ఒకవేళ ఏదైనా కారణంగా ఆ రోజు సిలిండరు పంపిణీ మర్నాటికి వాయిదా పడితే మరో ధర అమల్లోకి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని పునరాలోచించాలంటూ మంత్రిత్వ శాఖకు లేఖ రాశాం. -ఎల్పీజీ డీలర్ల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్‌

ఇదీచదవండి:'ఆవేదన: భూములిచ్చినా 'చుక్క నీరు అందటం లేదు'

ABOUT THE AUTHOR

...view details