కాలజ్ఞాని శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతి పీఠం కోసం అన్నదమ్ముల మధ్య పోరు రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఏపీలోని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి వ్యవహరించారు. ఆయన ఇటీవల కాలధర్మం చెందారు. దీంతో పీఠం కోసం స్వామి మొదటి భార్య చంద్రావతమ్మ కుమారులైన వేంకటాద్రిస్వామి, వీరభద్రస్వామి, వీరంబొట్లయ్య, దత్తాత్రేయస్వామి, రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ కుమారుడి మధ్య పోటీ నెలకొంది.
పీఠం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పెద్ద కుమారుడికి స్థానికుల్లో కొందరు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మారుతి మహాలక్ష్మమ్మ మాట్లాడుతూ పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టేందుకు తన కుమారుడికి అన్ని అర్హతలూ ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు పీఠాధిపతి వీలునామా రాశారని పత్రాన్ని చూపుతున్నారు. తమ కుమారుడు గోవిందస్వామికి వేద విద్యతో పాటు పూజా కార్యక్రమాల విధానాలను దివంగత మఠాధిపతి నేర్పించారని తెలిపారు.