తెలంగాణ

telangana

ETV Bharat / state

రైళ్ల రాకపోకలకు కంట్రోల్ రూమే కేంద్ర బిందువు - పర్యవేక్షణంతా కంట్రోల్ సెంటర్లోనే...

రైలుబండి.. రైల్వే స్టేషన్​కు సమయానికి చేరాలంటే దాని వెనకాల అనేక కసరత్తులు జరుగుతాయి. అనేకమంది ఉద్యోగులు, అధికారులు అందులో భాగస్వామ్యమవుతారు. రైలు నడిపేది లోకో పైలటే అయినా పైలట్ సమర్థంగా పనిచేసేందుకు ఒక వ్యవస్థ ఉంటుంది. అదంతా కంట్రోల్ రూం కనుసన్నల్లో జరుగుతుంది. రైలు ఎప్పుడు బయలుదేరాలి? ఎంత వేగంతో బయలుదేరాలి? ఎప్పుడు ఆగాలి ? ఎక్కడ ఆగాలి ? అనే అంశాలు కీలకం.

రైల్వే రాకపోకలకు కేంద్ర బిందువు కంట్రోలరే
రైల్వే రాకపోకలకు కేంద్ర బిందువు కంట్రోలరే

By

Published : Mar 10, 2020, 6:10 AM IST

రైళ్ల క్రాసింగ్​లు వంటి కీలక నిర్ణయాలన్నీ.. నియంత్రణ కేంద్రంలో జరుగుతుంటాయి. వీరి ఆదేశానుసారమే రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. చివరకు ప్రయాణికుల ఫిర్యాదులు స్వీకరించాలన్నా.. వాటికి పరిష్కారం జరగాలన్నా... అది కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది.

రైళ్ల రాకపోకలకు కేంద్ర బిందువు నిలయమైన కంట్రోల్ రూంలో మహిళా కంట్రోలర్లు సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థలోనే కీలకమైన ఈ విభాగంలో మహిళలు రాణిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఆరు డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్​కు ఒక్కో కంట్రోల్ కార్యాలయం ఉంటుంది. వీటన్నింటికి అనుసంధానంగా సుమారు 26 కంట్రోల్ బోర్డులు పనిచేస్తుంటాయి.

పర్యవేక్షణంతా ఆ సెంటర్లోనే...

నియంత్రణ కేంద్రం (కంట్రోల్ సెంటర్)లో ప్రయాణికుల రైళ్ల సమయపాలన, గూడ్స్ రైళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, బోగీలు, వ్యాగన్​లు, సిగ్నలింగ్, ట్రాక్ మరమ్మతుల నిర్వహణ, ప్రయాణికుల ఫిర్యాదులు, విపత్తుల నిర్వహణను ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. కంట్రోల్ కేంద్రాల కార్యనిర్వహణలో అనేక విభాగాలు సమష్టిగా పనిచేస్తుంటాయి. అందులోనూ ఇంజినీరింగ్ వ్యవస్థ, విద్యుత్ ఇంజన్, డీజీల్ ఇంజన్, సరుకు రవాణా బోగీలు, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ, విద్యుద్ధీకరణ, రక్షణ విభాగం వంటివాటితో పాటు స్టాక్, ప్రధాన లైన్లు, బొగ్గులైన్లు, సమయ పాలన కోసం విభాగాలు నిరంతరం పనిచేస్తుంటాయి. వీటి నిర్వహణను ముఖ్య కంట్రోలర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.

కంట్రోలర్స్​దే రైళ్ల నిర్వహణ...

నియంత్రణ కేంద్రంలో నియంత్రణ అధికారులు (కంట్రోలర్స్) పనిచేస్తుంటారు. రైళ్ల రాకపోకల పర్యవేక్షణ, రైళ్లు క్రాస్ అవుతున్నప్పుడు ప్రణాళికబద్ధంగా వ్యవహరించడం, ఎప్పటికప్పుడు రైల్వేస్టేషన్ అధికారులు- కంట్రోల్ బోర్డుతో సమన్వయం చేసుకోవడం వంటివి చేస్తుంటారు. కంట్రోలర్లు పనిచేసే కంట్రోల్ కార్యాలయం ఎల్లవేళలా పనిచేస్తుంది. రైల్వే స్టేషన్లకు కంట్రోల్ ఫోన్, రైల్వే ఆటో ఫోన్, ట్రాక్షన్ పవర్ కంట్రోల్ ఫోన్ వంటివి అందుబాటులో ఉంటాయి. అదనంగా టర్మినల్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్​కు మధ్య అనుసంధానకర్తగా వ్యవస్థ ఉంటుంది.

ఫిర్యాదుల నిర్వహణ కంట్రోల్ రూంలోనే...

కంట్రోల్ రూములోనే మరో ముఖ్యమైన విభాగం ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ. ఇందులో ప్రయాణికుల ఫిర్యాదులను స్వీకరించడం, సలహాలు ఇవ్వడం చేస్తుంటారు. ఇక్కడి నుంచి దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ నిర్వహణ, ఆన్ బోర్డ్ హెల్ప్ లైన్ నిర్వహణ, కేంద్ర ప్రజా ఫిర్యాదులను పర్యవేక్షించడం, కోచ్ మిత్ర, భద్రతా హెల్ప్ లైన్, వెబ్ నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణ వంటివి కొనసాగుతుంటాయి. కంట్రోల్ రూం సమాచార సేకరణలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తుంది. కంట్రోల్ కార్యాలయ ఆటోమేషన్ అప్లికేషన్, సరుకు రవాణా సమాచార వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ కోచింగ్ మేనేజ్ మెంట్ వంటి అంశాల్లో సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది.

రైల్వే రాకపోకలకు కేంద్ర బిందువు కంట్రోలరే

ఇవీ చూడండి : ముఖ్యమంత్రికి రక్షణగా నారీశక్తి

ABOUT THE AUTHOR

...view details