తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరోగ్యకరమైన వ్యవసాయానికి ప్రత్యేక పరిశోధన - Organic farming news

దేశమంతా రసాయనాల్లేని జీవన, సేంద్రియ ఎరువుల వాడకంతో సేద్యం పెరుగుతున్నందున కేంద్రం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. సేంద్రియ సేద్యం కోసం వాడండంటూ మార్కెట్‌లో పెద్దఎత్తున జీవన, సేంద్రియ ఎరువులను విక్రయిస్తున్నారు. వాటి నాణ్యతను ఇకనుంచి ప్రయోగశాలల్లో పక్కాగా పరీక్షించాలని కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

Control over fertilizer tests says Central Department of Agriculture
ఎరువుల పరీక్షలపై నియంత్రణ.. పరిశోధన శిక్షణ కేంద్రాల ఏర్పాటు

By

Published : Jul 22, 2020, 6:44 AM IST

ఇకనుంచి ఎరువులను పరీక్షించేవారికి కనీస విద్యార్హతలుండాలని కేంద్ర వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.

రసాయనశాస్త్రం, భూసార శాస్త్రం, మైక్రోబయోలజీ, మొక్కల పరీక్షల శాస్త్రం (పాథాలజీ), బయోటెక్నాలజీ, ఉద్యానశాస్త్రం, బయో ఇంజినీరింగ్‌లలో ఏదో ఒక దాంట్లో తప్పనిసరిగా పోస్టుగ్రాడ్యుయేషన్‌(పీజీ) ఉత్తర్ణులే ఇకనుంచి జీవన, సేంద్రియ ఎరువులతో పాటు నూనెమిల్లుల వ్యర్థాల ఎరువుల నాణ్యతను ప్రయోగశాలల్లో పరీక్షించి ధ్రువీకరించాలి.

వీరిని ‘అనలిస్టు’లని పిలుస్తారు. వీరు తప్పనిసరిగా దేశంలో కేంద్రం ఏర్పాటుచేసిన ఏదైనా జాతీయ, ప్రాంతీయ సేంద్రియ ప్రయోగశాల లేదా సంస్థలో శిక్షణ పొందాలి.

ఒకవేళ ఎవరైనా ఇప్పటికే అనలిస్టులుగా ఉద్యోగాల్లో చేరి, ఈ అర్హతలు లేకుంటే రాబోయే మూడేళ్లలో తప్పనిసరిగా పొందాలి.జాతీయ శిక్షణ కేంద్రం ఇప్పుడు ఘజియాబాద్‌లో ఉంది.

ఈ శిక్షణ కోసం బెంగళూరు, భువనేశ్వర్‌, హిస్సార్‌, ఇంఫాల్‌, జబల్‌పూర్‌, పంచకుల, నాగ్‌పుర్‌లలో ప్రాంతీయ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు.

మరికొన్ని రసాయన ఎరువులకు అనుమతి

వ్యవసాయ భూముల్లో సారం తక్కువగా ఉన్నందున భూసార పరీక్షలు చేయించి తక్కువగా ఉన్న సూక్ష్మపోషకాలను రసాయనాల రూపంలో అందించేందుకు కొత్త మిశ్రమ (కాంప్లెక్స్‌) ఎరువుల తయారీ, అమ్మకాలకు కేంద్రం అనుమతించింది. అవి...

  • ప్రత్యేకంగా కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిరప పంటకు వాడేందుకు 16:16:10:4:1:0.2 కాంప్లెక్స్‌ ఎరువు తయారీ, అమ్మకాలకు అనుమతించింది. ఇందులో నత్రజని, భాస్వరం, పొటాష్‌, జింకు, గంధకం, బోరాన్‌లు వరసగా అంకెల శాతాల్లో ఉండాలి.
  • ఇవే జిల్లాల్లో ఇదే మిరప పంటకు 21 శాతం నత్రజని, 9 శాతం పొటాష్‌తో మరో మిశ్రమ ఎరువుకు అనుమతించింది. ఈ జిల్లాల్లోని నేలలో ఈ పోషకాలు తక్కువగా ఉన్నాయని ప్రత్యేక అనుమతి ఇచ్చారు.
  • కొత్తగా 9:24:24 పేరుతో తయారుచేసే మిశ్రమ ఎరువులో మెగ్నిషియం, గంధకం, జింక్‌, బోరాన్‌లు సైతం కలిపి అమ్మడానికి అనుమతించింది. ఇందులో 9 శాతం నత్రజని, 24 శాతం చొప్పున భాస్వరం, పొటాష్‌లు కాక మిగతావి స్వల్పంగా కలిపి తయారుచేయాలి.
  • 28:28:0 పేరుతో అమ్ముతున్న మిశ్రమ ఎరువులో బోరాన్‌ కలపడానికి అనుమతించింది.
  • నీటిలో కలిపి వాడే ఎరువుల్లో కొత్తగా 13:0:45 పేరుతో 13 శాతం నత్రజని, 45 శాతం పొటాష్‌లతో పాటు, 1.5 శాతం క్లోరైడ్‌, ఒక శాతం సోడియం కూడా కలపడానికి అనుమతించారు.
  • చెరకు పంటకు ప్రత్యేకంగా నత్రజని, భాస్వరం, పొటాష్‌లను ఒక్కోటీ 8 శాతం చొప్పున కలిపి ఎరువు తయారీకి అనుమతించారు. ఇందులో 2 శాతం సల్ఫేట్‌ కలపాలి. ఈ ఎరువును ద్రవరూపంలోనే అమ్మాలి.కాల్షియం డై హైడ్రోజన్‌ ఎరువును పూర్తిగా భాస్వరంతో తయారు చేసి ద్రవరూపంలో అమ్మాలి.

ఇదీ చదవండి:ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details