గుత్తేదారు చేతులెత్తేయడం వల్ల టార్పాలిన్ల టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో ఈ అంశాన్ని సర్కారు తీవ్రంగా పరిగణించింది. గుత్తేదారు డిపాజిట్‌గా దరఖాస్తుతో చెల్లించిన రూ.17 లక్షలు జప్తు చేయాలని ‘రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ’(ఆగ్రోస్) నిర్ణయించింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తక్షణం ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలోనే టెండర్లు పిలిచి టార్పాలిన్లు కొనుగోలు చేయాలని కలెక్టర్లను వ్యవసాయశాఖ ఆదేశించింది. జిల్లాలు వెంటనే రంగంలోకి దిగి టార్పాలిన్ల నాణ్యత, ధర విషయంపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది.
రవాణా కష్టమనే సాకుతో...
రాష్ట్రంలో మొత్తం 70 వేల టార్పాలిన్లు అవసరమని వ్యవసాయశాఖ భావించి.. వాటిని జిల్లాలకు సరఫరా చేసే బాధ్యతను ఆగ్రోస్‌కు అప్పగించింది. ఆగ్రోస్ టెండర్లు పిలిచింది. ఒక్కో టార్పాలిన్‌ను రూ.1,296కు సరఫరా చేస్తామని, అదనపు ఖర్చులుంటాయని ఓ కంపెనీ టెండరు వేసింది. ఇదే ఎల్1 ధరగా వచ్చినందున టెండరు అప్పగించారు. టెండరు ఖరారయ్యాక గుజరాత్, పంజాబ్‌ల నుంచి టార్పాలిన్లు తేవాల్సి ఉంటుందని, లాక్‌డౌన్ నేపథ్యంలో రవాణా ఆంక్షలను సడలిస్తూ కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించాలని, వాటిని నిత్యావసర చట్టం కిందకు మార్పించాలని గుత్తేదారు షరతులు పెట్టాడు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేదని, ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించడానికి అక్కడి వ్యవసాయశాఖలతో రాష్ట్ర అధికారులు మాట్లాడారు. అయినా లాక్‌డౌన్ నేపథ్యంలో నష్టమొస్తుందనే నెపంతో సరఫరా చేయలేనని గుత్తేదారు చేతులెత్తేశాడు. ఎల్2 కింద రెండో స్థానంలో నిలిచిన కంపెనీ ఒక్కో టార్పాలిన్‌కు రూ.2,100 చొప్పున ఇవ్వాలని టెండర్ వేసింది. అంత ధరకిస్తే భారం అధికమవుతుందని టెండర్లను పూర్తిగా రద్దుచేశారు. ఇప్పటికిప్పుడు టెండర్లు పిలిచి కొనాలంటే ఆలస్యమతుందని జిల్లాల్లోనే సమకూర్చుకోవాలని కలెక్టర్లకు సూచించారు.