ప్రగతిభవన్(pragathi bhavan) ముట్టడికి నర్సులు(nurse protest) యత్నించగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. నర్సులను అడ్డుకున్న పోలీసులు... వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కరోనా(corona) సమయంలో విధుల్లోకి తీసుకున్నారని.. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా బయటకు పంపారని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1640 మందిని తొలగించారని గోడు వెల్లబోసుకున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని నర్సులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అట్టుడికిన ప్రగతిభవన్ పరిసరాలు
ఔట్ సోర్సింగ్ నర్సుల ధర్నాతో ప్రగతి భవన్ ప్రాంతం అట్టుడికింది. దాదాపు రెండు గంటల పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి తమను విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను క్రమబద్ధీకరించాలని కోరారు. మంగళవారం డీఎంఈ కార్యాలయంలో బైఠాయించిన ఔట్ సోర్సింగ్ నర్సులు... ఈ రోజు ఏకంగా ప్రగతి భవన్ని ముట్టడించారు. దాదాపు రెండు గంటల పాటు పంజాగుట్ట, ప్రగతి భవన్ పరిరస ప్రాంతాల్లో బైఠాయించి ఆందోళనలు చేశారు.
ఉద్రిక్తత
తొలుత ప్రగతి భవన్ వద్దకు వచ్చిన నర్సింగ్ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. రాజీవ్ చౌక్ వద్ద నడి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం మళ్లీ ప్రగతి భవన్ వద్దకు చేరుకుని రోడ్డుపైనే కూర్చుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పలువురు నర్సింగ్ సిబ్బంది స్పృహ కోల్పోవడం గమనార్హం. దాదాపు రెండు గంటల పాటు ప్రగతి భవన్ పరిసరాల్లో ఆందోళనలు చేపట్టి.... తమ పోస్టులను క్రమబద్ధీకరించాలంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
కొవిడ్ సేవలు అద్భుతంగా చేస్తున్నారు... మిమ్మల్ని దేవతల్లాగా పూజిస్తున్నామని సీఎం అన్నారు. ఆ దేవతల్ని ఈరోజు రోడ్డు మీద పడేశారు. మార్చిలోనే చెప్తే మేం ప్రత్యామ్నాయం చూసుకునేవాళ్లం. విధుల్లోకి రావొద్దు అంటూ ఇప్పటికప్పుడు చెప్తే ఎలా?. తల్లిదండ్రుల దగ్గరకు పిల్లలు రాని పరిస్థితుల్లోనూ మేము ప్రాణాలకు తెగించి సేవలందించాం. మా సేవలను పొడిగించండి. మాకు న్యాయం చేయండి. మమ్మల్ని రోడ్డున పడేయొద్దు.
-నర్సులు