తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏకధాటి వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలం - హైదరాబాద్​లో ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలు

బస్తీల్లోకి వరదనీరు.. చెరువుల్ని తలపించేలా రహదారులు.. స్థంభించిన ట్రాఫిక్‌.. ఇళ్ల నుంచి బయటకి రాని జనం.. ఇది ప్రస్తుతం భాగ్యనగరి ముఖచిత్రం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వాననీరు చేరడం వల్ల స్థానికులు బయటకి రాలేక అవస్థలు పడుతున్నారు.

ఏకధాటి వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలం
ఏకధాటి వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలం

By

Published : Sep 26, 2020, 9:11 PM IST

ఏకధాటి వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలం

ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్‌ అతలాకుతలమైంది. రహదారులతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు... వరదనీటితో మునిగిపోయాయి. నీరు ఇళ్లలోకి చేరడం వల్ల నిత్యావసర సరకులు తడిసిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌స్తంభాలు నేలకూలాయి. సరూర్‌నగర్‌ పరిధిలోని కోదండరాంనగర్‌, హనుమాన్‌నగర్‌, పద్మావతికాలనీలను వరదనీరు ముంచెత్తింది. కాలనీలు చెరువుల్లా మారడం వల్ల ఎక్కడ మ్యాన్‌హోల్ ఉందో తెలియక అవస్థలు పడ్డారు. శారదనగర్‌లోని ఓ ఇంట్లోకి వరద నీరు చేరడం వల్ల అందులో ఉంటున్న వృద్ధున్ని స్థానికులు భవనంపై గదిలోకి తరలించారు.

ఆటోపై కూలిన చెట్టు

బేగంపేట్ మయూరి మార్గ్‌ కాలనీలో వరదనీరు చేరి స్థానికులు ఇంటికే పరిమితమయ్యారు. ఇళ్లల్లోకి నీరు ప్రవేశించినందున రాత్రంతా ఆ నీటిని బయటకు ఎత్తిపోశామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్‌పేట్‌-ఉప్పల్‌ రహదారిపై వెళ్తున్న ఆటోపై చెట్టు కూలింది. డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పగా... ఆటో ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న జీహెచ్​ఎంసీ అధికారులు చెట్టును తొలగించారు.

గరిష్ఠానికి చేరిన సాగర్ నీటిమట్టం

లింగంపల్లి, చందానగర్, మియాపూర్ పరిసరాల్లోనూ రహదారులన్నీ జలమయమయ్యాయి. పాత లింగంపల్లి ప్రాంతంలో మురుగునీటితోపాటు.. వర్షపునీరు తోడై రాకపోకలకు అంతరాయం కలిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలుకాలనీల వీధులు జలమయమయ్యాయి. వనస్థలిపురం పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. భారీగా కురుస్తున్న వర్షానికి హుస్సేన్‌సాగర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.60 మీటర్లుగా ఉంది. సాగర్ గేట్లు పైకి ఎత్తి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు.

మోకాళ్లలోతు నీరు

టోలిచౌకిలోని నదీమ్ కాలనీ పూర్తిగా నీటిలో మునిగింది. సుమారు మోకాళ్లలోతు నీళ్లు ఉండడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. జీడిమెట్ల ఫాక్స్ సాగర్ వరద కాలువ పొంగి.. చుట్టుపక్కల కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముషీరాబాద్‌ పరిధిలోని అడిక్‌మెట్‌లోని అంజయ్యనగర్‌లో వర్షపునీటితో పాటు డ్రైనేజీ పొంగి.. కాలనీవాసులు తీవ్ర అవస్థలుపడ్డారు. ఆ ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పర్యటించి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంత్రి సబిత పర్యటన

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పరిధి లెనిన్‌నగర్‌లోని ఇళ్లల్లోకి వాననీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రాంతంలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. వరదల్లో చిక్కుకున్న వారు ప్రభుత్వ పాఠశాల, కమ్యూనిటీ భవనాలకు వెళ్లాలని సూచించారు. వర్షానికి రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి పరిధిలోని రాయల్‌ కాలనీ, మెట్రోసిటీ, నబీల్‌ కాలనీ, గ్రీన్‌ సిటీ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. సమీపంలోనే చెరువు ఉన్నందున ఆ నీరు కూడా కాలనీల్లోకి ప్రవేశించింది. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో చెరువులు అలుగు పారుతున్నాయి. మంబాపూర్, మాన్‌సాన్‌పల్లి, కోకట్ వాగులతో పాటు.. తాండూరు సమీపంలో కాగ్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. పంటపొలాల్లోకి నీరు చేరడం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఎడతెరిపిలేకుండా వాన.. చెరువులను తలపిస్తోన్న కాలనీలు

ABOUT THE AUTHOR

...view details