భారీ వానలు రాష్ట్రాన్ని హడలెత్తిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నారాయణపేట జిల్లాలో పెద్దవాగు, ఊక చెట్టు, బండారుపల్లి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల వద్ద వాగులో చేపలవేటకు వెళ్లిన యువకుడు నీటిలో కొట్టుకుపోయాడు. స్థానిక యువకులు తాడు సాయంతో క్షేమంగా ఒడ్డుకుచేర్చారు. పరిధిపూర్ జలాశయం పొంగిపొర్లడం వల్ల అటువైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జోగులాంబ గద్వాల నందిన్నే వాగుపై తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు మరోసారి కొట్టుకుపోయింది. చాలా ప్రాంతాల్లో చెరువుకట్టలు తెగి పంటలు నీటమునిగాయి.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచనలు
మహబూబ్‌నగర్‌లో వరదనీరు పోటెత్తి రామయ్యబౌలీ, బీకేరెడ్డి, బృందావన్ తదితర కాలనీలు జలమయమయ్యాయి. నాలాల పరిమాణం కుదించి కబ్జా చేయడం వల్లే తమ కాలనీలకు ఈ పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాలనీల్లో పర్యటించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నాలాలు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాకపోకలకు తీవ్ర అంతరాయం
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. సిద్దిపేటలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఉప్పొంగడం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెక్‌డ్యామ్‌లు, వాగుల వరద ఉద్ధృతికి పంటలు నీటమునిగాయి. నారాయణఖేడ్ శివారులో వర్షాలకు కోతకు గురైన రోడ్లను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పరిశీలించారు. మనోహరాబాద్ రామయపల్లి వద్ద రైల్వే అండర్‌పాస్‌లో భారీగా నీరు నిలిచినందున రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది.