రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలను ఇప్పుడే తెరవొద్దని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. ఆన్‌లైన్, టీవీ ద్వారా సొసైటీలు బోధన కొనసాగించనున్నాయి. హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతినే పాటించనున్నాయి. గతంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యక్ష బోధనకు గురుకులాలు సిద్ధమయ్యాయి. విద్యార్థులకు వారం రోజుల క్వారంటైన్ అమలు చేసేలా నిబంధనలు రూపొందించుకున్నాయి. తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 1425 ప్రభుత్వ గిరిజన పాఠశాలలు మినహా సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు ఇప్పుడే తెరుచుకునే పరిస్థితులు లేవని సంక్షేమ వర్గాలు వెల్లడించాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల ప్రారంభానికి అనుమతి లేకపోవడంతో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. వసతి గృహాలు తెరుచుకోకపోవడంతో వీరంతా పాఠాలకు దూరం కానున్నారు.
నిర్వహణ విధానం తయారీపై దృష్టి
కరోనా మూడో దశ ముప్పు హెచ్చరికలు, మౌలిక సదుపాయాలపై హైకోర్టు సూచనల నేపథ్యంలో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు నిర్దిష్ఠ నిర్వహణ విధానం (ఎస్‌వోపీ) సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు.
వారు చదువుకునేదెలా?
హైకోర్టు తీర్పు నేపథ్యంలో రెసిడెన్షియల్ పాఠాశాలలు, వసతి గృహాలను తెరవరాదని ప్రభుత్వం నిర్ణయించింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో నడుస్తున్నందున వాటిని తెరవరాదు. రాష్ట్రంలోని 484 కేజీబీవీల్లో దాదాపు లక్ష మంది అమ్మాయిలు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుంటున్నారు. ఇప్పటివరకు టీవీ పాఠాలు వింటున్నారు. ప్రభుత్వం బుధవారం నుంచి టీవీ పాఠాలను ప్రసారం చేస్తుందో?లేదో? అన్న సంశయం వారిని వెంటాడుతోంది. ఆ పాఠాలు లేకుంటే తాము చదువుకు దూరం కావాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం టీవీ పాఠాల టైమ్ టేబుల్‌ను ప్రతి 15 రోజులకు ఒకసారి విద్యాశాఖ జారీ చేస్తోంది. మంగళవారం గడువు ముగిసినా తాజా టైమ్ టేబుల్ రాలేదు. అంటే బుధవారం టీవీ పాఠాలు లేనట్లేనని తెలుస్తోంది.