హైదరాబాద్ తార్నాకకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఆర్.సంజీవ రావు డైనింగ్ టేబుల్, ఆరు కుర్చీల కొనుగోలు కోసం పంజాగుట్టలోని షీబా వుడ్ హాండీ క్రాఫ్ట్స్‌ను సంప్రదించారు. చర్చల తర్వాత 56వేల రూపాయలతో సరఫరా చేసేందుకు షాపు యజమాని మొహమ్మద్ షాజెబ్‌తో గతేడాది సెప్టెంబరు 29న సంజీవరావు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్సుగా 25వేల రూపాయలు చెక్కు ద్వారా ఇచ్చారు.
మూడు నెలలు గడిచినప్పటికీ...
పది, పన్నెండు రోజుల్లో డైనింగ్ సెట్ తయారు చేసి సరఫరా చేస్తామని దుకాణం నిర్వాహకుడు తెలిపారు. షాపు యజమాని ఇచ్చిన సమయం గడిచినా డైనింగ్ సెట్ తయారు చేయలేదు. మరో వారం సమయం కావాలని షాజెబ్ కోరడం వల్ల.. సంజీవరావు దానికి కూడా సరే అన్నారు. రోజులు, వారాలే కాదు.. సుమారు మూడు నెలలు గడిచిపోయినప్పటికీ... డైనింగ్ సెట్ సంజీవరావు చేతికి అందలేదు.
వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు...
విసిగిపోయిన సంజీవరావు తన అడ్వాన్సు తిరిగి ఇచ్చేయాలని కోరగా... షాపు నిర్వాహకుడు స్పందించ లేదు. ఇక లాభం లేదనుకుని సంజీవరావు హైదరాబాద్ జిల్లా మూడో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. షీబా వుడ్ హాండీ క్రాఫ్ట్స్ యజమాని తనను మోసం చేశారని.. నమ్మకద్రోహానికి పాల్పడ్డారని సంజీవరావు వినియోగదారుల ఫోరానికి వివరించారు. తన అడ్వాన్సును వడ్డీతో పాటు ఇప్పించడంతోపాటు తనకు మానసిక ఆవేదన కలిగించినందుకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని సంజీవరావు కోరారు. వివరణ ఇవ్వాలని షీబా వుడ్ హాండీ క్రాఫ్ట్స్ యజమానకి షాజెబ్కు వినియోగదారుల ఫోరం నోటీసు పంపినప్పటికీ స్పందించలేదు.
ముప్పై రోజుల్లో చెల్లించాలి...
సంజీవరావు సమర్పించిన ఆధారాలన్నీ పరిశీలించిన వినియోగదారుల ఫోరం షాజెబ్ సేవ, నమ్మక ద్రోహం, అనైతిక వ్యాపార పద్ధతులకు పాల్పడినట్లు నిర్ధారించింది. సంజీవరావుకు 25వేల రూపాయలను 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు.. సంజీవరావుకు మనోవేదన కలిగించినందుకు 12వేల రూపాయల పరిహారం, వివాదం కోసం ఖర్చుల కింద మరో 6వేలు చెల్లించాలని ఫోరం స్పష్టం చేసింది. ముప్పై రోజుల్లో ఇవన్నీ చెల్లించకపోతే.. వాటిన్నింటినీ 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే అనైతిక వ్యాపారానికి పాల్పడినందుకు మరో 10వేల రూపాయలు కూడా సంజీవరావుకు ఇవ్వాలని వినియోగదారుల ఫోరం తీర్పు వెల్లడించింది.