హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన 32 ఏళ్ల వివేక్ దీక్షిత్ 2018 మేలో క్విక్కర్లో (quicker) ఓ వస్తువు కొనుగోలు చేశాడు. పేటీఎం (paytm) ద్వారా బిల్లు చెల్లించేందుకు ప్రయత్నిచగా... పేటీఎం ఖాతాలో కావాల్సినంద ఎమౌంట్ లేదు. అందుకోసం మరో 6,865 రూపాయలు హెచ్డీఎఫ్సీ ఖాతా నుంచి పేటీఎంలో డిపాజిట్ చేసి... క్విక్కర్కు బదిలీ చేశాడు. ఆ తర్వాత తనకు అందిన వస్తువుపై సంతృప్తి చెందని వివేక్ దీక్షిత్.. దానిని వాపస్ చేశాడు. తాను పే చేసిన మొత్తాన్ని రిఫండ్ చేయాలని క్విక్కర్ను కోరాడు. అంగీకరించిన క్విక్కర్ సొమ్ము తిరిగి చెల్లించి.. వివేక్ దీక్షిత్‌కు సమాచారం ఇచ్చింది. కానీ వివేక్ దీక్షిత్ పేటీఎం ఖాతాలోకి నగదు రాలేదు (Telangana State Consumer Commission).
ప్రొడక్ట్ బగ్ వల్ల మరొకరి ఖాతాలో జమ
తన పేటీఎం ఖాతాలోకి సొమ్ము రీఫండ్ కాలేదని క్విక్కర్కు... వివేక్ దీక్షిత్ ఫిర్యాదు చేశాడు. పరిశీలించిన క్విక్కర్.. సొమ్ము తిరిగి చెల్లించామని.. పేటీఎం సంస్థను అడగాలని సూచించింది. క్విక్కర్ రీఫండ్ చేసిన సొమ్ము తన ఖాతాలోకి రాలేదని పేటీఎంను సంప్రదించాడు. పలుమార్లు ఫిర్యాదు చేయగా.. ఓ రోజు పేటీఎం సాంకేతిక విభాగం ఉద్యోగి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొన్నాడు. అన్నీ పరిశీలించిన పేటీఎం సంస్థ... క్విక్కర్ బదిలీ చేసిన సొమ్ము కంచర్ల శ్రీధర్ అనే మరో వ్యక్తి పేటీఎం ఖాతాలో జమ అయిందని తెలిపారు. సాఫ్ట్వేర్ లోపం వల్ల అలా జరిగిందని చెప్పారు. కంచర్ల శ్రీధర్ ఫోన్ నంబరు చెబితే తన సొమ్ము తనకు బదిలీ చేయాలని కోరతామని వివేక్ దీక్షిత్ అడిగినప్పటికీ... పేటీఎం ప్రతినిధి అంగీకరించలేదు. పేటీఎం తీరుతో విసిగిపోయిన వివేక్ దీక్షిత్... చివరకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌కు 2019 నవంబరు 14న ఫిర్యాదు చేశాడు (Telangana State Consumer Commission). బ్యాంకు లావాదేవీలు, పేటీఎంకు పంపిన ఫిర్యాదు, ఉద్యోగితో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఆడియోలను కూడా సమర్పించాడు.
ఖాతాలో సొమ్మే జమ కానప్పుడు..రీఫండ్ ఎలా అవుతుంది:? పేటీఎం
తాను చెల్లించిన 6,865 రూపాయలు తిరిగి చెల్లించడంతో పాటు.. రూ.19 లక్షలు పరిహారం, పిటిషన్ ఖర్చుల కింద మరో రూ.2వేలు చెల్లించేలా పేటీఎంను ఆదేశించాలని వివేక్ కోరాడు. హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ వక్కంటి నరసింహారావు, సభ్యులు పీవీటీఆర్ జవహర్ బాబు, ఆర్ఎస్ రాజశ్రీ విచారణ చేపట్టారు. తన ఫిర్యాదుపై వివేక్ దీక్షిత్ స్వయంగా వాదించారు. వివేక్ దీక్షిత్ ఫిర్యాదుపై పేటీఎం లిఖితపూర్వక వాదనలను సమర్పించింది. వివేక్ దీక్షిత్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి శ్రీధర్ పేటీఎం ఖాతాలోకి సొమ్ము చేరిందని.. అక్కడి నుంచి క్విక్కర్ వెళ్లిందని వివరించింది. మళ్లీ క్విక్కర్ రీఫండ్ చేసిన సొమ్ము కూడా శ్రీధర్ పేటీఎం ఖాతాలోకే బదిలీ అయిందని తెలిపింది. వివేక్ దీక్షిత్ పేటీఎం ఖాతా నుంచి లావాదేవీలు జరగలేదు కాబట్టి.. పిటిషన్‌కు విచారణ అర్హతే లేదని పేర్కొంది. వివేక్ దీక్షిత్ ఫిర్యాదుపై స్పందించామని.. ఆయన అడిగిన అన్ని వివరాలు అందచేసినట్లు తెలిపింది.