తెలంగాణ

telangana

ETV Bharat / state

TSRTC Cargo Service : పార్శిల్‌ పంపమంటే.. వేలంలో అమ్మేశారు​ - TSRTC Latest News

TSRTC Cargo Service : ఓ వ్యక్తి హైదరాబాద్​ నుంచి కామారెడ్డికి టీఎస్​ఆర్టీసీ కార్గో సర్వీసులో ఓ పార్శిల్‌​ను పంపిచాడు. అయితే పార్శిల్‌​ను తీసుకోవాల్సిన వ్యక్తి అక్కడికి వెళ్లగా.. అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండాసదరు పార్శిల్‌​ను సమాచారమివ్వకుండానే అధికారులు వేలం వేశారు.​ బాధిత వ్యక్తి వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కమిషన్​ అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

Consumer Commission
Consumer Commission

By

Published : Jan 11, 2023, 9:29 AM IST

TSRTC Cargo Service : వేల రూపాయల విలువైన పార్సిల్‌ను నిర్దేశిత గమ్యానికి చేర్చకుండా.. సదరు వ్యక్తులకు సమాచారమివ్వకుండా వేలంలో విక్రయించిన టీఎస్‌ఆర్టీసీకి వినియోగదారుల కమిషన్‌ మొట్టికాయలు వేసింది. కార్గో సేవల్లో లోపం కలిగించినందుకు పార్సిల్‌ రశీదుపై పేర్కొన్న వస్తువు విలువ రూ.6 వేలను 12శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని, పరిహారం రూ.10 వేలు, కేసు ఖర్చులు రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది.

హైదరాబాద్‌ తిరుమలగిరికి చెందిన కన్హ ఎంటర్‌ప్రైజెస్‌ తరఫున సంస్థ ప్రతినిధి గంప శరత్‌చంద్ర ఫిర్యాదును విచారించిన కమిషన్‌ ఈ మేరకు తీర్పు వెలువరించింది. 45 రోజుల్లో అమలు చేయాలంటూ టీఎస్‌ఆర్టీసీ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ (కార్గో పార్సిల్‌), కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌ను ఆదేశించింది. ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. శరత్‌చంద్ర హైదరాబాద్‌ నుంచి కామారెడ్డిలో ఓ వ్యక్తికి పార్సిల్‌ పంపేందుకు 2021 అక్టోబరులో జూబ్లీ బస్టాండ్‌లో రూ.115 బుకింగ్‌ ఛార్జీ చెల్లించి బాక్స్‌ను అందజేశారు.

పార్సిల్‌ తీసుకోవాల్సిన వ్యక్తి కామారెడ్డిలోని కార్గో ఆఫీస్‌కు వెళ్లగా సరైన సమాచారం అందించకుండా దాటవేసే ధోరణిలో మాట్లాడారని ఆరోపించారు. అందులో రూ.41 వేల విలువైన ఉత్పత్తులున్నాయని చెప్పినా వినిపించుకోలేదని తెలిపారు. మెయిల్‌లో సంప్రదించినా, కామారెడ్డి డిపో మేనేజర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశమివ్వలేదని పేర్కొన్నారు. ఇలా విచారిస్తున్న క్రమంలో 66 రోజుల తర్వాత పార్సిల్‌ను రూ.100కు వేలంలో విక్రయించారని తెలుసుకుని.. వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీనిపై రాతపూర్వక వివరణ అందించిన ఆర్టీసీ.. వచ్చిన పార్సిల్‌పై ఫోన్‌ నంబర్‌ మినహా ఏమీ పేర్కొనలేదని, ఆ బాక్సులో ఉన్న ఉత్పత్తుల విలువ రూ.6 వేలు మాత్రమేనని నమోదు చేశారని విన్నవించింది. కామారెడ్డిలోని కార్గో కార్యాలయం క్లర్క్‌.. సదరు వ్యక్తికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో వేలం వేశామని తెలిపింది. అయితే వేలం వేసే ముందు కనీస సమాచారమివ్వలేదన్న ఫిర్యాదుదారు వాదనతో ఏకీభవించిన కమిషన్‌-1 బెంచ్‌ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఇవీ చదవండి:బయో ఏసియా సదస్సుకు 200మంది ప్రముఖులు

ఆఫ్‌లైన్‌లో 'ఆధార్‌' వెరిఫికేషన్​కు సరికొత్త రూల్స్​.. కచ్చితంగా పాటించాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details