Nampally GHMC parking complex delayed in hyderabad : హైదరాబాద్ నగరంలో పార్కింగ్ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చాలా మెట్రో స్టేషన్ల వద్ద వాహనాలు నిలిపేందుకు చోటు చాలడం లేదు. ఈ తరహా సమస్యల పరిష్కారం కోసం నాంపల్లిలో మొదటిసారి బహుళ అంతస్తుల అత్యాధునిక ఆటోమేటెడ్ పార్కింగ్ సముదాయం నిర్మాణం జరుగుతోంది. నిర్మాణపనులు తీవ్ర ఆలస్యంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు చెందిన నాంపల్లిలోని దాదాపు అర ఎకరం విస్తీర్ణంలో అత్యాధునిక బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం పనులకు 2018 సెప్టెంబరు 8న భూమిపూజ చేశారు.
పీపీపీ భాగస్వామ్యంతో..:గాంధీభవన్, నాంపల్లి మెట్రో స్టేషన్ మధ్య పార్కింగ్ సముదాయం పనులు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో.. రెండు ఇన్ఫ్రా సంస్థలు సంయుక్తంగా నోవమ్ పేరుతో పీపీపీ(పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్షిప్) పద్దతిలో టెండర్‌ను దక్కించుకున్నాయి. జర్మన్ సాంకేతికతతో రూ.60 కోట్ల అంచనాతో చేపట్టేందుకు ముందుకొచ్చాయి. 9 నెలల్లో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఘనంగా ప్రకటించాయి. ఇప్పటికీ నిర్మాణం పూర్తికాలేదు.
నగరంలోనే మొదటిసారి..: ఈ పార్కింగ్ సముదాయంలో ఏకకాలంలో 250 కార్లు, 100 ద్విచక్రవాహనాలను నిలుపవచ్చు. వాహనం నిలిపితే ఆటోమేటిక్‌గా ఖాళీ ఉన్న పార్కింగ్ ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఈ తరహా విధానం సిటీలో కొన్ని ప్రైవేటు సంస్థల్లో ఉన్నాయి. ఇంత పెద్ద స్థాయిలో రావడం ఇదే మొదటిసారి. ఈ సముదాయంలో కింది ఐదు అంతస్తుల్లో రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు ఉంటాయి. పై అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ ఉంటుంది.