కరోనాకు ఎదురొడ్డి నిలిచిన నిర్మాణ రంగం.. ఆదాయం తగ్గినా ఆగిపోలేదు! - తెలంగాణ వార్తలు
నిర్మాణ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. భవన నిర్మాణ అనుమతులు భారీగా తగ్గడం వల్ల ఆదాయం తగ్గింది. గ్రేటర్‌లో కొంతవరకు ఈ రంగం మెరుగ్గానే ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. ఆదాయం తగ్గినా కొవిడ్‌కు ఎదురొడ్డి నిలబడిందని తెలిపింది.
కరోనా సమయంలో నిర్మాణరంగం, నిర్మాణరంగ ఆదాయం
By
Published : Apr 18, 2021, 10:05 AM IST
నిర్మాణ రంగంపై కొవిడ్ ప్రభావం చూపింది. భవన నిర్మాణాల అనుమతులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గాయి. ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే సుమారు 30 శాతం తగ్గుదల నమోదైంది. కరోనా మహమ్మారికి భయపడి చాలా మంది వాణిజ్య నిర్మాణాలను వాయిదా వేసుకున్నారు. వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి సైతం తక్కువ సంఖ్యలో దరఖాస్తులొచ్చాయి. అనుమతుల రుసుము రూపంలో వచ్చే ఆదాయం రూ.300 కోట్ల మేర తగ్గింది. అయినప్పటికీ ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్‌లో నిర్మాణ రంగం బాగా రాణించినట్లు జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది.
తగ్గిన భారీ భవనాలు..హైదరాబాద్‌లో ఆకాశ హర్మ్యాలు పెరుగుతున్నాయనే ఆశలపై కొవిడ్ నీళ్లు చల్లింది. 2020-21లో కేవలం 67 భారీ భవనాలకే ఆమోదం లభించింది. అయిదు అంతస్తులు, అంతకు మించిన నివాస సముదాయాల కోసం ఎక్కువ దరఖాస్తులు పశ్చిమ నగరం నుంచే వచ్చాయి. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో అపార్ట్‌మెంట్లకు ఆదరణకు ఉండటంతో, ఆ ప్రాంతాల్లోని ప్రాజెక్టులపై కొవిడ్ ప్రభావం తక్కువగా కనిపించిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలోనూ మంచి పురోగతి ఉందన్నారు.
వారసత్వ కట్టడాలకు ‘ఇన్‌టాక్’ గుర్తింపు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: చారిత్రక భాగ్యనగరంలో ఎన్నో వారసత్వ కట్టడాలు పాలకుల నిర్లక్ష్యంతో మరుగునపడిపోతున్నాయి. వాటిని సంరక్షించేందుకు కృషి చేస్తోంది ఇన్‌టాక్ సంస్థ. నేడు ప్రపంచ వారసత్వ కట్టడాల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు పురాతన నిర్మాణాలను ప్రత్యేక వారసత్వ కట్టడాలుగా గుర్తించింది. నగరంలోని ఈపీటీఆర్‌ఐ కేంద్రంలో శనివారం సమావేశం నిర్వహించి.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా, ఇన్‌టాక్ తెలంగాణ కో కన్వీనర్, హైదరాబాద్ ఛాప్టర్ కన్వీనర్ అనురాధరెడ్డి ఈ కట్టడాల వివరాల్ని వెల్లడించారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రం, టీబీ, ఛాతీ ఆసుపత్రులు, కలినరీ హెరిటేజ్‌లో కరాచీ బేకరీ, కార్ఖానా జిందాతిలిస్మాత్ భవనం, మోండా మార్కెట్‌లోని జైల్ ఖానా, నగరంలో నిర్మించిన మొదటి ఆర్‌సీసీ కట్టడం, నాంపల్లిలోని బ్యాచ్‌లర్స్ క్వార్టర్స్ భవనాలతో పాటు వీటిని పరిరక్షిస్తున్న వారికీ ఈ గుర్తింపు దక్కుతుందని అనురాధరెడ్డి తెలిపారు.
చంచల్‌గూడ జైల్లో ఖైదీలు బ్యారక్‌లకే పరిమితం
చంచల్‌గూడ, న్యూస్‌టుడే: కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడికి చంచల్‌గూడ జైలులో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. ఖైదీలు బ్యారక్‌ల నుంచి బయటకు రాకుండా ఆహారాన్ని సైతం వారి వద్దకే తీసుకెళ్లి అందిస్తున్నామని పర్యవేక్షణాధికారి డా. శ్రీనివాస్ శనివారమిక్కడ తెలిపారు. వైద్య అవరాల కోసం తప్పితే ఖైదీలనందరినీ బ్యారక్‌లకే పరిమితం చేసినట్లు ఆయన వెల్లడించారు. రంజాన్ మాసంలో 350 మంది ఖైదీలు ఉపవాస దీక్షలో ఉండడంతో వారందరిని ప్రత్యేక బ్యారక్‌లలో ఉంచి, నిబంధనల ప్రకారం నిత్యం తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ఆహార పదార్థాలను అందిస్తున్నామని చెప్పారు.