తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరంలోని చెరువుల్లో సెర్చ్‌ టవర్ల ఏర్పాటు.. నిరంతర నిఘా.. - search towers

నగరంలో కనుమరుగవుతోన్న నీటి వనరుల సంరక్షణకు జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన చెరువుల్లో సెర్చ్‌ టవర్లు నిర్మించి నిరంతర నిఘాకు సిద్ధమైంది. ప్రస్తుతం టవర్ల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉంది. పనులు పూర్తయితే ప్రణాళిక ప్రకారం టవర్లపై 24గంటలూ భద్రతా సిబ్బంది ఉంటారు. టవర్‌పై అత్యాధునిక లైట్లు, తటాకం చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి.

Construction of search towers at  ponds in hyderabad
నగరంలోని చెరువుల్లో సెర్చ్‌ టవర్ల ఏర్పాటు.. నిరంతర నిఘా..

By

Published : Jun 24, 2020, 7:11 AM IST

ఒకప్పుడు వందలాది చెరువులు హైదరాబాద్‌లో ఉండేవి. ఆక్రమణలు, అభివృద్ధి పనుల రూపంలో అనేకం కనుమరుగై ప్రస్తుతం వాటి సంఖ్య 185కు పరిమితమైంది. వాటికీ కబ్జాదారుల బెడద పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బల్దియా ఈ నిఘా వ్యవస్థ రూపొందించింది. గుర్తించిన అన్ని ప్రధాన చెరువుల్లో 9 మీటర్ల ఎత్తున సెర్చ్‌ టవర్లు నిర్మించి, సెక్యూరిటీ గార్డులను నియమించనుంది. ఇప్పటికే సుమారు 100 మంది సిబ్బందితో జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చెరువుల పరిరక్షణ విభాగం(లేక్‌ ప్రొటెక్షన్‌ సెల్‌) ఏర్పాటుచేసింది. వారు 20 చెరువుల వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా సెర్చ్‌ టవర్లు దోహదపడతాయి.

కార్యాచరణ ఇలా...

  • చెరువులోకి వాహనాలు వెళ్లే మార్గాల వద్ద సీసీ కెమెరాలుంటాయి. ఆయా వీడియోలను రోజూ పరిశీలించడం ద్వారా నిర్మాణ వ్యర్థాల తరలింపు ఆగుతుంది. ఉల్లంఘనులకు భారీ జరిమానాలు విధిస్తారు. బాధ్యులపై చర్యలు ఉంటాయి.
  • చీకటిలోనూ కిలోమీటరు దూరం స్పష్టంగా చూడగలిగే సెర్చ్‌లైటు టవర్‌పై ఉంటుంది. రాత్రిళ్లు చెరువులో మట్టి నింపే ముఠాలను గమనించి అడ్డుకోవచ్ఛు
  • చెరువుల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో రోజూ చెరువుల ఫొటోలు, వీడియోల పరిశీలన ఉంటుంది. ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులు, డిజిటల్‌ పటాల వివరాలతో వెబ్‌సైట్‌ రూపొందించి, వాటితో రోజువారీ వివరాలను సరిపోల్చి ఆక్రమణలను నివారిస్తారు.

పర్యవేక్షణ అధికారులను నియమించాం

చెరువుల పరిరక్షణ విభాగం సిబ్బంది సెర్చ్‌ టవర్ల నుంచి నిఘా పెడతారు. వారి విధులను నిత్యం పర్యవేక్షించేందుకు అధికారులను ఇన్‌ఛార్జులుగా నియమించాం. కూకట్‌పల్లి జోన్‌ పరిధిలో 42 చెరువులకు బాధ్యులను నియమిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చాం. వారంతా రోజువారీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా చెరువుల ఆక్రమణ, నిర్మాణ వ్యర్థాలు, చెత్త వేయడం వంటి కార్యక్రమాలను అడ్డుకుంటాం. సీసీ కెమెరాల దృశ్యాలు, చిత్రాలతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.- వి.మమత, జోనల్‌ కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ

ABOUT THE AUTHOR

...view details