తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి మట్టాలను పెంచే దిశగా చెక్​డ్యాంల నిర్మాణం

జలాశయాలు, చెరువులు లేని ప్రాంతాల్లో నీటి మట్టాలను పెంచాలన్న లక్ష్యంతో... ప్రభుత్వం చెక్ డ్యాంలు మంజూరు చేస్తోంది. తద్వారా తాగుకు, సాగుకు నీరందించే అవకాశం ఏర్పడుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 72 చెక్ డ్యాంలు నిర్మాణం కానుండగా... 326 కోట్లు మంజూరయ్యాయి.

check dams
నీటి మట్టాలను పెంచే దిశగా చెక్​డ్యాంల నిర్మాణం

By

Published : Jan 29, 2021, 12:06 PM IST

వాగుల వద్ద పారే జలాలకు అడ్డుకట్ట వేసి నిల్వ చేయడం.. ఎత్తైన ప్రాంతాల్లో పడిన వర్షపు నీరు దిగువన చేరి నిలిచే ప్రాంతాల్లో చెక్​ డ్యాం​లు నిర్మిస్తారు. ఒక చెక్​ డ్యాం నిర్మాణం వల్ల.. ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలోని భూభాగంలో ఊట పెరుగుతుంది. ఒక్కో ఆనకట్ట కింద 250 నుంచి 5 వందల ఎకరాల వరకు పంటలు పండించేందుకు అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్లే ఉమ్మడి నల్గొండ జిల్లాలో... 72 చెక్ డ్యాంలు మంజూరయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం 326.38 కోట్లు మంజూరు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో టెండర్లు కేటాయించిన వెంటనే... నిధులు రాకముందే అక్కడి గుత్తేదారులు పనులు ప్రారంభించారు. మొత్తం 10కి గాను 6 చోట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. రాజాపేట మండలం రఘునాథపురం శివారులో ఆలేరు వాగుపై చేపట్టిన చెక్ డ్యాం నిర్మాణం... 90 శాతం పూర్తయింది. అటు బొమ్మలరామారం మండలం మేడిపల్లి శివారులో... శామీర్ పేట వాగుపై ఆనకట్ట నిర్మాణం సాగుతోంది. ఇక్కడ కూడా పనులు... 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. యాదాద్రి జిల్లాలో గత జూన్​లోనే ఆరింటి పనులు మొదలు కాగా... మరో నాలుగు చోట్ల ప్రారంభించాల్సి ఉంది.

నీటి మట్టాలను పెంచే దిశగా చెక్​డ్యాంల నిర్మాణం
నీటి మట్టాలను పెంచే దిశగా చెక్​డ్యాంల నిర్మాణం

ప్రారంభం కాని పనులు

నల్గొండ జిల్లా ఇప్పరి వద్ద సైతం... చెక్ డ్యాం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 39కి గాను... రెండు చోట్ల మాత్రమే పనులకు శ్రీకారం చుట్టారు. ఇక సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 72 చెక్ డ్యాంలకు గాను... 65 పనుల టెండర్లు పూర్తయ్యాయి. మరో ఏడింటికి సంబంధించిన ప్రక్రియ మిగిలి ఉంది. వీటిని కూడా పూర్తి చేసి అతి త్వరలోనే గుత్తేదారులకు పనులు కట్టబెడతామని... అధికారులు అంటున్నారు. నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 39 చెక్ డ్యాంలు మంజూరయ్యాయి. 36 నిర్మాణాలకు తొలిదశ ప్రతిపాదనలు పంపగా, మరో మూడింటిని అదనంగా కలిపి ప్రభుత్వం... 39 మంజూరు చేసింది. సూర్యాపేట జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లకు 23... యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి పరిధిలో 10 చెక్ డ్యాంలకు గాను నిధులు వచ్చాయి.

నీటి మట్టాలను పెంచే దిశగా చెక్​డ్యాంల నిర్మాణం

నిధులు మంజూరైన దృష్ట్యా పనులు వేగవంతం చేయాలని... ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ నిర్మాణాలకు... గుత్తేదారులు ముందుకువస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details