ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం గ్రేటర్ హైదరాబాద్‌లో లబ్ధిదారులకు చేరే దశకు చేరుకుంది. జీహెచ్ఎమ్సీ పరిధిలో దాదాపు 85 వేల ఇళ్లు సిద్ధమవుతున్నాయి. మహా నగరంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో పురోగతిపై రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ కలెక్టర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. డిసెంబర్ నాటికి సుమారు 85 వేలకుపైగా రెండు పడక గదుల ఇళ్లను పేదలకు అందిస్తామని అధికారులు మంత్రికి వివరించారు. అందులో 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు కాగా.. మరో 10 వేలు జనూరామ్, వాంబే ఇళ్లు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. చాలా చోట్ల పనులు తుదిదశకు చేరాయని వెల్లడించారు. డిసెంబర్ నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్లు నివేదించారు. తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కేటీఆర్.. ఇళ్లను తొందరగా పేదలకు అందజేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.
10 శాతం స్థానిక కోటా
జీహెచ్ఎమ్సీ పరిధిలో 9 వేల 700 కోట్ల రూపాయల వ్యయంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్న కేటీఆర్.. దేశంలో ఏ మెట్రో నగరంలోనూ ఇంత పెద్దఎత్తున పథకం అమలు కావడం లేదన్నారు. నగరంలో 24 నియోజకవర్గాల్లో 4 వేల చొప్పున లక్ష ఇళ్లు అందిస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన లబ్దిదారుల పరిధి.. రూపొందించామన్నారు. ముందుగా ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు ఇచ్చిన మురికివాడల్లోని లబ్ధిదారుల జాబితాను అప్‌లోడ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 10 శాతం స్థానిక కోటాలో భాగంగా ఆయా జిల్లాల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎమ్సీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని... సింహభాగాన్ని ఈ ఏడాదే ప్రజలకు అందిస్తామని కేటీఆర్ వెల్లడించారు.