తెలంగాణ

telangana

ETV Bharat / state

రిజర్వేషన్ల రద్దుకు ప్రభుత్వాల కుట్ర - Telangana Congress Maha Dharna news

దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అణగదొక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లపై టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్​ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో హస్తం నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Conspiracy by governments to cancel reservations
రిజర్వేషన్ల రద్దుకు ప్రభుత్వాల కుట్ర

By

Published : Feb 18, 2020, 7:24 AM IST

భాజపా న్యాయవాదుల బలహీనమైన వాదనల కారణంగానే సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లపై టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద జరిగిన మహాధర్నాలో హస్తం నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

భరోసా కల్పించడానికే మహా ధర్నా

బలహీన వర్గాలకు భరోసా కల్పించడానికే మహా ధర్నా చేపట్టామని ఉత్తమ్​ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. దళితుడైన దామోదరం సంజీవయ్యను సీఎంను చేసింది తమ పార్టీ అని.. తెరాసలో ఆ అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చెయ్యండి

ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా బలహీనపరుస్తూ.. ప్రైవేట్‌ యూనివర్సిటీలను సీఎం కేసీఆర్‌ ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. 70 ఏళ్లుగా కాంగ్రెస్‌ ఏం చేయలేదని భాజపా వాదిస్తోందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా తెలిపారు. గాంధీ, నెహ్రూ, సర్దార్‌పటేల్‌లు సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించేందుకు వీలుగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు.

తెరాస ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది

భావోద్రేకాలతో కూడిన మాటలతో భాజపా, తెరాస ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చాయని భట్టివిక్రమార్క వెల్లడించారు. ప్రస్తుత పరిణామాలపై ఈపార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి ఎంఐఎం కూడా పోరాటంలో పాల్గొనాలని కోరారు. హామీలు, పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వాలు రిజర్వేషన్ల అంశం తెరపైకి తెచ్చాయని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. భాజపా ప్రభుత్వం తన అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి కొత్త చట్టాలు చేస్తోందని దుయ్యబట్టారు.

ఇవీ చూడండి: ఇంటర్‌ విద్యార్థి ప్రాణం తీసిన చాక్లెట్‌!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details