తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజక వర్గాల్లో గెలుపోటములపై గాంధీభవన్ లెక్కలు కడుతోంది. ఏయే నియోజక వర్గాల్లో ఏయే పార్టీలకు బలం ఉంది, ఏ నేతలు బలహీనంగా ఉన్నారు... అక్కడున్న తాజా రాజకీయ పరిణామాలు ఏమిటనే అంశాల ఆధారంగా విజయావకాశాలపై లెక్కలు వేస్తోంది. హైదరాబాద్ మినహా 16 పార్లమెంటు స్థానాలు తమవే అంటూ అధికార పార్టీ ధీమాగా ప్రచారంలో దూసుకుపోతోంది. అసెంబ్లీలో ఓటమి చవి చూసిన కాంగ్రెస్.. ఈసారైనా సత్తా చాటాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్రంలో పాగా వేయటమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించింది. ప్రచారంలో ప్రజాస్పందన, అభ్యర్థుల బలాబలాలు పరిశీలించి... గెలుపోటములపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
కొత్త వ్యక్తులు కావడం వల్ల లాభిస్తోంది
మల్కాజిగిరి, నల్గొండ స్థానాల్లో తెరాస కొత్త వ్యక్తులు మర్రి రాజశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి నరసింహారెడ్డిను బరిలోకి దింపిడం, వారు ప్రచారాల్లో అంతగా దూసుకుపోలేకపోవడం, అభ్యర్థులు రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు అందరి మద్దతు కూడగట్టుకుంటూ అన్ని వర్గాలకు దగ్గరవడం చూసి తమ విజయం ఖాయమనే ధీమాతో హస్తం నేతలు ఉన్నారు. చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ కావడం, గత ఐదేళ్ల కాలంలో ఆయన చేసిన అభివృద్ధికి తోడు అధికార పార్టీకి చెందిన అభ్యర్ధి రంజిత్ రెడ్డి రాజకీయాలకు కొత్తకావడం కలిసొస్తున్న అంశమని పార్టీ లెక్కలు కడుతోంది. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి బలమైన అభ్యర్థి కావడం, అధికార పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెదేపా నుంచి వలస రావడంతో పార్టీలోని నేతల మధ్య సఖ్యత లేకపోవడం లాంటివి ఇక్కడ లాభిస్తాయని అంచనాకు వచ్చింది. ఈ కారణాలతో ఈ నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు ఢోకా లేదన్న ధీమా హస్తం పార్టీలో వ్యక్తమవుతోంది.
ఇక్కడ గట్టి పోటీ ఇస్తాం..