Congress VS BRS on Praja Garjana Meeting: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాన పార్టీల విమర్శలు- ప్రతివిమర్శలతో రాజకీయ వేడి రాజుకుంటోంది. మూడ్నెళ్ల ముందుగానే అధికార బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా.. అటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ సైతం ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేసింది. చేవెళ్లలో ప్రజాగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో ప్రకటించిన ఎస్సీ, ఎస్సీ డిక్లరేషన్‌పై గులాబీ దళం విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్‌ది డిక్లరేషన్ సభకాదు.. అధికారం రానే రాదనే ఫ్రస్ట్రేషన్ సభని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా విమర్శించగా.. ఇందుకు కొనసాగింపుగా మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, పార్టీ నేతలు కాంగ్రెస్ తీర్మానంపై వాగ్బాణాలు సంధించారు.
"దేశంలో అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దళితులను దారిద్య్రరేఖకు దిగువగా ఉంచారు. బీఆర్ఎస్ దళిత బంధు రూ.10 లక్షలు ఇస్తామంటే.. కాంగ్రెస్ రూ.12 లక్షలు ఇస్తారని చెబుతున్నారు. తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ నాయకులకు లేదు."- కవిత, ఎమ్మెల్సీ
BRS Leaders Criticise Congress Party : 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌కు ఎస్సీల సంక్షేమం గుర్తుకు రాలేదా అని కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రశ్నించారు. దళిత, గిరిజనుల వెనకబాటు తనానికి కాంగ్రెస్సే కారణమని కవిత ఆరోపించారు. హస్తం పార్టీవన్నీ ఉత్తుత్తి డిక్లరేషన్‌లుగా మంత్రి హరీశ్‌రావుఅభివర్ణించారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక చతికిలపడ్డ కాంగ్రెస్.. రాష్ట్రంలో అధికారంలోకి ఎలాగూ వచ్చిది లేదనే ఇష్టానుసారంగా తీర్మానాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. దళిత, గిరిజనుల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ తెలిపారు. డిక్లరేషన్‌లో ప్రకటించిన ప్రతీ అంశాన్ని అమలుచేసి తీరుతామన్నారు. ఎస్సీలపై ప్రేమ ఉంటే వారికిచ్చిన హామీ మేరకు వెంటనే దళిత ముఖ్యమంత్రిని చేయగలరా అని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. మూడెకరాల భూమి, దళిత సీఎంతో పాటు అనేక హామీలిచ్చి.. అడుగడుగునా కేసీఆర్ వారిని మోసం చేశారని షబ్బీర్ అలీ ఆరోపించారు.