CONGRESS 'VARI DEEKSHA': రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ పోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో వినతి పత్రాలు, కల్లాల్లో కాంగ్రెస్ పేరిట నిరసనలు తెలిపిన పార్టీ... 'వరిదీక్ష'(congress varideeksha) పేరిట మరోసారి ఆందోళనకు దిగింది. కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఇందిరాపార్క్‌లో దీక్ష(congress varideeksha) చేపట్టనున్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి సహా ముఖ్యనేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఇవాళ రాత్రి దీక్షాస్థలంలోనే నేతలు బసచేసి రేపు కూడా నిరసన కొనసాగిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులతో ఆడుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో వానాకాలంలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేసేవరకూ పోరాటం ఆగదని నేతలు స్పష్టం చేస్తున్నారు.
వరి దీక్షకు హాజరైన ఎంపీ కోమటిరెడ్డి
ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ వరి దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. ఆయనను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. దీక్షా వేదికపై రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డిలు పక్కపక్కనే కూర్చున్నారు.
పంట కొనకపోవడానికి కేసీఆర్ వైఖరి తప్ప మరో కారణం లేదు: చిన్నారెడ్డి
పంట వేసే ముందు కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టని ప్రభుత్వాలు.. వానాకాలం పంట ఎందుకు కొనరని కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సర్కారు రూ.1370 కోట్లు మిల్లర్లకు బాకీ ఉందని ఆయన అన్నారు. అందుకే కేసీఆర్ రైస్ మిల్లర్లను పిలిచి మాట్లాడటం లేదని విమర్శించారు. గన్నీ బ్యాగులు సప్లై చేసే వాళ్లకు రూ.7,000 కోట్లు కేసీఆర్ సర్కారు బాకీ ఉందని. అందుకే వాళ్లు కొత్త బ్యాగులు ఇవ్వడం లేదని ఆరోపించారు. హమాలీ, సుతిలీ, ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు వాస్తవానికి సివిల్ సప్లై కార్పొరేషనే పెట్టుకోవాలి.. కానీ వాటిని కూడా కేసీఆర్ రైతులతోనే పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం సేకరణ చేస్తోన్న మహిళా సంఘాలకు క్వింటాల్‌కు రూ.32 ఇవ్వాలి... అది కూడా ఇవ్వడం లేదన్నారు. వానాకాలం పంట కొనకపోవడానికి కేసీఆర్ వైఖరి తప్ప మరో కారణం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి విమర్శలు గుప్పించారు.