తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Vari Deeksha: "డ్రామాలు ఆపండి.. ధాన్యం కొనండి.. వరిదీక్షలో కాంగ్రెస్ డిమాండ్"

కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు నాటకాలు కట్టిపెట్టి వానాకాలం ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌ ధర్నాచౌక్ వద్ద రెండు రోజులపాటు వరిదీక్ష చేసిన నేతలు... ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అన్నదాతల్ని ఆగం చేస్తున్న తెరాస, భాజపాను గద్దె దించితేనే... రైతులకు న్యాయం జరుగుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై సోమవారం గవర్నర్‌ను కలుస్తామని... ఐనా ప్రభుత్వాలు దిగిరాకపోతే దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు దిగుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Congress Vari Deeksha
హైదరాబాద్‌ ధర్నాచౌక్ వద్ద రెండురోజులపాటు వరిదీక్ష చేసిన నేతలు

By

Published : Nov 28, 2021, 11:33 PM IST

హైదరాబాద్‌ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన వరిదీక్ష

వానాకాలం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన వరిదీక్ష(congress vari deeksha) ముగిసింది. దీక్షలో కూర్చున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా నేతలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వరి విషయంలో రైతుల్ని అయోమయంలోకి నెట్టేందుకు తెరాస, భాజపా కలిసి కొత్త నాటకానికి తెరలేపాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. రైతుల మీద కక్షతోనే ధాన్యం కొనుగోలులో కేసీఆర్ జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. వరి వద్దంటున్న కేసీఆర్‌ రాష్ట్రాన్ని ఇంకా పాలించడం అవసరమా...? అనే విషయాన్ని అన్నదాతలంతా ఆలోచించాలని రేవంత్‌రెడ్డి (pcc president reventh reddy at vari deeksha) కోరారు.

"కేసీఆర్‌ మూర్ఖత్వం వల్లే ధాన్యం మొలకలు వచ్చి నిరుపయోగంగా మారింది. వరి వద్దంటే వేశారనే కక్షతోనే కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు చేయట్లేదు. 60 లక్షల మెట్రిక్‌ ధాన్యం తీసుకుంటామని కేంద్రం గతంలో చెప్పింది. రైతుల కడగండ్లకు ప్రధాన కారణం కేసీఆరే. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌ ధర్నాలు చేశారు. ఎత్తేసిన ధర్నా చౌక్​లోనే నిస్సిగ్గుగా కేసీఆర్ ధర్నా చేశారు. రైతుల మీద కక్షతోనే కొనుగోలులో జాప్యం చేశారు. దిల్లీకి వెళ్లిన కేసీఆర్‌... ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా కోరలేదు. కేసీఆర్‌, మంత్రులు రెండ్రోజులు దిల్లీలో విందు చేసుకుని వచ్చారు. అవగాహన లేని మంత్రులను దిల్లీకి పంపారు. కల్లాల్లో రైతుల చావులు ప్రభుత్వ హత్యలే. తెరాస, భాజపా కలిసి కొత్త నాటకానికి తెరలేపారు. దిల్లీ వెళ్లి వచ్చిన బండి సంజయ్.. వరి మాటలు పక్కన పెట్టి విద్యా వైద్యం మీద సంతకం అని కొత్త రాగం ఎత్తుకున్నారు. పండించిన పంటను కొనని ప్రభుత్వాన్ని బొంద పెడదాం. రేపు గవర్నర్​ను కలుస్తాం. రైతుల సమస్యను పార్లమెంట్​లో లేవనెత్తుతాం. డిసెంబర్ 9 నుంచి 13లోపు దిల్లీ జంతర్​మంతర్ వద్ద దీక్ష చేపడుతాం"

- రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

తెరాస, భాజపా నాటకాలు

రైతు సమస్యల్ని పక్కదోవ పట్టించేందుకు నాటకాలు ఆడుతున్న తెరాస, భాజపా ప్రభుత్వాలను… ప్రజలే పక్కకు తప్పిస్తారని జానారెడ్డి స్పష్టం చేశారు. వరి వేస్తే ఉరే అంటున్న కేసీఆర్‌కు రైతులే ఉరి వేస్తారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(komati reddy venkat reddy at vari deeksha) హెచ్చరించారు.

సమస్యలను పరిష్కరించడంలో భాజపా, తెరాస ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. ప్రజలు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు ప్రజల గోసను ప్రభుత్వానికి విన్నవిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపాన్ని నెడుతూ సమస్యను పక్కదారిపట్టిస్తున్నాయి. ప్రజలు ఆ రెండు పార్టీలను పక్కకు పెడతారు. కాంగ్రెస్ నేతలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలి.

-జానారెడ్డి, కాంగ్రెస్​ సీనియర్​ నేత

చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా అందరం కలిసి పనిచేస్తాం. కాంగ్రెస్​లో మేమందరం పీసీసీ ప్రెసిడెంట్లమే. మాకు పదవులు ముఖ్యం కాదు. నా రక్తంలోనే కాంగ్రెస్‌ ఉంది. కేసీఆర్‌ సంపాదన నిజాంల కంటే ఎక్కువుంది. ఇంత దోపిడీదారుడిని ప్రజలు ఎక్కువ కాలం భరించొద్దని కోరుతున్నా.

-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపీ

రైతులకు పట్టిన చీడ కేసీఆర్...

కాంగ్రెస్‌ వరిదీక్షకు మద్దతు ప్రకటించిన తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ (tjs president at vari deeksha)... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులకు పట్టిన చీడగా అభివర్ణించారు. చేనుకు చీడ పడితే ఏం చేయాలో కర్షకులకు తెలుసని వ్యాఖ్యానించారు.

రైతు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు కేసీఆర్​ యత్నిస్తున్నారు. కల్లాల్లో ఎలాంటి వసతులు లేవు. ఇసుక లారీలను పదిరోజులు ఆపితే వరి ధాన్యం రవాణా చేయొచ్చు. ఖరీఫ్​తో పాటు యాసంగి పంట కూడా కొనాలి. రైతుల కోసం ఎక్కడికైనా వెళ్లి పోరాడతాం.

-కోదండ రాం, తెజస అధ్యక్షుడు

వానాకాలం ధాన్యం కొనుగోళ్ల సమస్యను సోమవారం గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఐనా ప్రభుత్వం దిగిరాకపోతే డిసెంబర్ 9 నుంచి 13లోపు జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.


ఇదీ చూడండి:

Congress vari deeksha: వరి దీక్షలో రైతుల కోసం 9 తీర్మానాలు..

ABOUT THE AUTHOR

...view details