Telangan Formation day 2023 : తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ హాజరయ్యారు. పార్టీ సీనియర్ నేతలతో కలిసి గన్‌పార్కు వద్ద మీరాకుమార్ అమరవీరులకు నివాళి అర్పించారు. బషీర్ బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని మీరాకుమార్ ప్రారంభించారు. అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్ మీదుగా ప్రదర్శన గాంధీభవన్‌కు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఉద్యమకారులను మీరాకుమార్ సన్మానించారు.
"తెలంగాణ దేనికోసం పోరాటం చేశారో ఆ లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ ప్రజల పోరాటం చూసి కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాలు మా పార్టీకి మాత్రమే తెలుసు."- మీరాకుమార్, లోక్‌సభ మాజీ స్పీకర్
BJP on TS Formation Day 2023 : వేడుకలను బీజేపీ ఘనంగా నిర్వహించింది. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జెండా ఆవిష్కరణ చేసి, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచినా.. బీఆర్ఎస్ పరిపాలనతో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదని సంజయ్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కోదండరాం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళి అర్పించి, నాటి పోరాట ఘట్టాలు గుర్తుచేసుకున్నారు.