T Congress Seniors Meeting Cancelled: రాష్ట్ర కాంగ్రెస్‌లో జంబో కమిటీల ప్రకటనతో మొదలైన అసంతృప్తి.. పార్టీని పీసీసీ, సీఎల్పీ వర్గాలుగా చీల్చిన పరిస్థితుల్లో ఆ పార్టీ అధిష్ఠానం చక్కదిద్దే చర్యలు చేపట్టింది. వలసవాదులకు పదవులు దక్కాయని.. జెండా మోసిన వాళ్లకి అన్యాయం జరిగిందని అసంతృప్తుల వర్గం ఆరోపిస్తూ రచ్చకెక్కిన నేపథ్యంలో.... తాజా పరిణామాలను అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో తొలి నుంచి ట్రబుల్ షూటర్‌గా పేరుండటమే కాకుండా... తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్రంతో అనుబంధం ఉన్న దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దించింది. పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర వ్యవహారాలపై స్పందించిన దిగ్విజయ్‌సింగ్.... సీనియర్లలో అసంతృప్తిని చల్లార్చేప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలోనే అసమ్మతి నేతలకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు.
అసంతృప్తివర్గంలో ఒకరైన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి దిగ్విజయ్‌సింగ్ ఫోన్‌చేశారు. తాజా పరిణామాలను తెలుసుకున్న ఆయన.... సమస్యలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. ముందుగా సాయంత్రం జరపాలని నిర్ణయించిన సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని దిగ్విజయ్ ఫోన్‌లో సూచించినట్లు మహేశ్వరెడ్డి తెలిపారు. దిగ్విజయ్ స్పందనను స్వాగతిస్తున్నట్లు.... త్వరలోనే ఆయన హైదరాబాద్ వస్తామని చెప్పినట్లు వివరించారు. కాంగ్రెస్ అధిష్టానం సమస్యలు పరిష్కరిస్తుందని నమ్ముతున్నట్లు మహేశ్వరెడ్డి తెలిపారు.