Telangana Congress Latest News: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షత వహించగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. 35 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ మెరుగుపడాలని.. పార్టీ ప్రచార వ్యూహకర్త సునీల్ కనుగోలు చెప్పినట్లు సమాచారం. 5 లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తక్షణం బలమైన అభ్యర్థులను గుర్తించి.. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలిసింది.
Congress Telangana Assembly Election Plan :వచ్చే ఎన్నికల్లో.. విజయానికి అనుసరించాల్సిన ప్రణాళికపై సునీల్ కనుగోలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సర్వేల్లో వెల్లడైన సమాచారం ఆధారంగా పార్టీ పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. 35 స్థానాల్లో మరింత గట్టిగా పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం. చర్చ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. బీసీలకు సీట్ల విషయం ప్రస్తావించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కనీసం రెండు స్థానాలు.. అంటే 34 సీట్లని బీసీ అభ్యర్థులకు కేటాయించాలని ఆయన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
Telangana Congress 100 Days Plan : రాబోయే 100 రోజులు ప్రచారం హోరెత్తించాలని కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది. బహిరంగ సభలు, హామీలపై అగ్రనేతలతో డిక్లరేషన్ల విడుదల, రాష్ట్ర ముఖ్య నేతలతో బస్సు యాత్ర వంటి త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని పీసీసీ నిర్ణయించింది. ఎన్నికల్లో ప్రచారం ఎలా నిర్వహించాలి, ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై చర్చించారు. చేరికలతో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్న నేతలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ర నేతలతో భారీ బహిరంగ సభ నిర్వహణ, అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నికల్లో ఇవ్వాల్సిన హామీల రూపకల్పనపై కమిటీలో చర్చించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మాట్లాడుతూ సీనియర్ నాయకురాలినైనా తాను ఫోన్ చేస్తే కొందరు ముఖ్యులు స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య కార్యకర్తలకు ఎలా న్యాయం చేస్తారని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం.