తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్‌ - Congress Plan for TS Assembly Elections 2023

Telangana Elections 2023 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ మేరకు దిల్లీలో సుదీర్ఘంగా జరిగిన వ్యూహ కమిటీ భేటీ అనంతరం.. ఎన్నికల కార్యాచరణ మొదలుపెట్టినట్లు ప్రకటించింది. పార్టీ గెలుపుకోసం నేతలంతా ఐక్యంగా ముందుకుసాగాలని అధిష్ఠానం దిశానిర్దేశం చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే.. ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించిన అగ్రనేత రాహుల్​.. అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టంచేశారు. వచ్చేవారం రోజుల్లో ఎన్నికల కమిటీ, జులై నెలాఖరుకు 70 మంది అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని హస్తం వర్గాలు చెబుతున్నాయి.

CONGRESS
CONGRESS

By

Published : Jun 28, 2023, 7:17 AM IST

రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్‌

Congress Strategy Telangana Elections : త్వరలో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. కాంగ్రెస్‌ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్​ను గద్దెదించేందుకు కర్ణాటకలో అమలు వ్యూహాన్నే అనుసరించి.. తెలంగాణలో విజయం సాధించాలని నిర్ణయించింది. ఈమేరకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశమైన.. కాంగ్రెస్‌ వ్యూహకమిటీ తెలంగాణలో అధికారం కైవసం చేసుకునేందుకు.. ఎలా ముందుకుసాగాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. హాజరైన నేతల నుంచి విడివిడిగా అభిప్రాయాలను స్వీకరించిన అధిష్ఠానం.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగేందుకు పలు సూచనలు చేసింది.

Telangana Assembly Elections 2023 :వ్యూహకమిటీ సమావేశంలో అగ్రనేత రాహుల్​ గాంధీకి.. కొందరునేతలు ఫిర్యాదులు చేసేందుకు సిద్ధం కాగా.. స్పందించిన ఆయన కీలకవ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఎవరు ఏంచేశారో తెలుసన్న రాహుల్.. ఎవరెవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసని చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీ అంతర్గత విషయాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ బయట మాట్లాడవద్దని హెచ్చరించారు. విభేదాలుంటే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ లేదంటే తనతోనైనా మాట్లాడాలని సూచించారు.

పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైన అయినా చర్యలకు ఉపేక్షించబోమని.. రాహుల్‌ హెచ్చరించినట్లు నేతలు వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక, ప్రకటనపై అధిష్ఠానానిదే తుదినిర్ణయమని.. పార్టీ కోసం అంతా ఐక్యంగా పనిచేయాలని రాహుల్‌ సూచించినట్లు మాజీ ఎంపీ మధుయాస్కీ వెల్లడించారు.

Telangana Elections Congress Strategy:రాష్ట్రంలో తాజా పరిణామాలపై పలువురు ప్రస్తావించగా.. బీఆర్ఎస్​ ఎక్కడా విపక్ష భాగస్వామ్య పార్టీ కాదు.. కాబోదని.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నట్లు తెలిసింది. విపక్షాలన్నీ మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతుంటే.. భారత్ రాష్ట్ర సమితి మాత్రం వారితో అంటకాగేందుకు ప్రయత్నాలు చేసిందని.. ఆ కారణంగానే పట్నాలో జరిగిన విపక్ష భేటీకి పిలువలేదని వివరించినట్లు సమాచారం.

బీఆర్ఎస్​తో ఆ ప్రస్తావన ఉండదు : తెలంగాణలో ఎవరితో పొత్తులుండవని.. బీఆర్ఎస్​తో ఆ ప్రస్తావన ఉండదని తెలిపారు. రాష్ట్రంలో ఒంటరిగానే ముందుకెళ్తోందని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. నేతలు పొత్తులపై ఆలోచన మానుకొని ప్రజల్లోకి వెళ్లాలని.. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలనిచెప్పినట్లు పలువురు నాయకులు వివరించారు. వివాదం లేని, అభ్యర్థుల మధ్య పోటీ లేని 70 స్థానాలు ఇప్పటికే గుర్తించామన్న నేతలు.. నెలరోజుల్లో అక్కడ పోటీచేసే వారి పేర్లు ప్రకటించనున్నట్లు చెప్పారు.

"రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై చర్చించాం. కేంద్రంలోని బీజేపీ అధికార దుర్వినియోగాన్ని ప్రజలకు ఎలా వివరించాలనే అంశాలపై సన్నాహాక సమావేశంలో చర్చించాం. తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాచరణ మొదలైంది."- రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Telangana Congress Latest News : ఈ క్రమంలోనే 3 రకాల సర్వేలు జరుగుతున్నాయని.. వాటి ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా.. అక్కడి బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని అమలుకి సాధ్యమైన హామీలనే మేనిఫెస్టోలో పొందుపరచాలని.. మల్లికార్జున ఖర్గే సూచించనట్లు తెలిసింది. అమలు చేయలేకపోతే.. ఆ ప్రభావం భవిష్యత్తులోనూ పార్టీపై ఉంటుందని.. అందుకని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం.

Congress Plan for TS Assembly Elections 2023 :అభ్యర్థుల ఎంపికపై.. జాబితా తయారు చేసి పంపితే చర్చించి అధిష్ఠానమే ప్రకటిస్తుందని.. ఖర్గే స్పష్టంచేసినట్లు రాష్ట్ర నేతలు తెలిపారు. పార్టీకి దూరమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని.. తెలంగాణకు ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ చెప్పారని నాయకులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details