తెలంగాణ

telangana

ETV Bharat / state

Priyanka Gandhi Hyderabad Tour : ప్రియాంక గాంధీ పర్యటనలో స్వల్ప మార్పులు.. ఆ టైమ్​కే సభ స్టార్ట్ - రేవంత్​రెడ్డి తాజా వార్తలు

Priyanka Gandhi Hyderabad Tour : సరూర్‌నగర్‌ యువ సంఘర్షణ సభ విజయవంతానికి.. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. మూడు రోజులుగా జన సమీకరణ, ఏర్పాట్లపై సమీక్షలు చేస్తోంది. ప్రియాంక గాంధీ తక్కువ సమయం రాష్ట్రంలో పర్యటిస్తుండటంతో అందుకు తగ్గట్లు కార్యక్రమాలను సవరించిన పీసీసీ యువ డిక్లరేషన్‌ ప్రకటనకు సిద్ధం అవుతోంది.

Priyanka Gandhi
Priyanka Gandhi

By

Published : May 7, 2023, 6:59 AM IST

రేపు హైదరాబాద్‌ రానున్న కాంగ్రెస్‌ నేత ప్రియాంకగాంధీ

Priyanka Gandhi Hyderabad Tour : రాష్ట్రానికి తొలిసారిగా కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వస్తుండటంతో.. పీసీసీ యువ సంఘర్షణ సభ విజయవంతానికి ముమ్మర కసరత్తు చేసింది. కర్ణాటక ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకొని.. హైదరాబాద్‌ రానున్న ప్రియాంక గాంధీ కేవలం ఒకటిన్నర గంటలు మాత్రమే.. రాష్ట్రంలో ఉంటారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి అధికారికంగా షెడ్యూల్‌ రావాల్సి ఉంది. ఈ నెల 8న సాయంత్రం 3.30 నుంచి 3.45 గంటల మధ్య బెంగళూరు నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ప్రియాంక చేరుకుంటారు.

ప్రియాంక చేతుల మీదుగా యువ డిక్లరేషన్ ప్రకటన: అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సరూర్‌నగర్‌ స్టేడియం చేరుకొని.. యువ సంఘర్షణ సభలో పాల్గొంటారు. నాలుగున్నరకు ప్రియాంక చేతుల మీదుగా యువ డిక్లరేషన్‌ ప్రకటన చేస్తారు. ఆ తర్వాత నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్న తీరు ఎండగడతారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువత కోసం ఏం చేస్తారో.. ఆ సభ ద్వారా స్పష్టం చేస్తారు. వరంగల్‌ సభలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించగా.. ఇప్పుడు సరూర్‌ నగర్‌ స్టేడియంలో ప్రియాంక గాంధీ యువ డిక్లరేషన్‌ ప్రకటిస్తారు.

యువ డిక్లరేషన్​లో ఉండే అంశాలు ఇవే: ప్రియాంక ద్వారా ప్రకటించనున్న యువ డిక్లరేషన్‌లో ఏ అంశాలుండాలన్న అంశంపై కొన్ని రోజులుగా పీసీసీ తీవ్ర కసరత్తు జరుగుతోంది. అధికార పక్షంపై విమర్శలు పక్కన పెడితే.. పాలకపక్షం నుంచి నిరుద్యోగ యువత తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో స్పష్టత ఇచ్చే విషయమై దృష్టి పెట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై యువ డిక్లరేషన్ ద్వారా స్పష్టత ఇచ్చే దిశలో కసరత్తు జరుగుతున్నట్లు.. కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

భారీ జన సమీకరణపై నేతల దృష్టి:కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మానిక్‌ రావు ఠాక్రే, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు.. ప్రియాంక గాంధీ పర్యటన ఖరారు కావడంతో మధ్యంతరంగా వచ్చేసి ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా ఏర్పాట్లు, జన సమీకరణపై దృష్టి సారించారు. బయట జిల్లాల నుంచి యువత తరలివచ్చేట్లు చర్యలు తీసుకోవడంతో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి జనాన్ని వీలైనంత ఎక్కువ మందిని సమీకరించాలని నియోజకవర్గాల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించారు.

ప్రియాంక పర్యటనలో స్వల్ప మార్పులు: మధ్యాహ్నం 3.30 గంటలకే ప్రియాంక గాంధీ వస్తుండడంతో.. ఆ సమయం కంటే ముందే జనం సభకు చేరుకునేట్లు చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నాయకులకు స్పష్టం చేశారు. ప్రియాంక సభతో.. నిరుద్యోగ యువతలో భరోసా కల్పిస్తామని నేతలు వెల్లడించారు. ప్రియాంక గాంధీ పర్యటనకు తక్కువ సమయం ఉండడంతో అందుకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించారు. తొలుత నిర్ణయించుకున్నట్లు శ్రీకాంతాచారికి నివాళులు అర్పించడం కానీ.. అక్కడ నుంచి స్టేడియం వరకు రోడ్‌ షో కానీ, పాదయాత్ర కానీ... ఉండవని కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details