కొలిక్కి వచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ- క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమవుతున్న అధికార బృందాలు Congress Six Guarantees in Telangana 2024 : అభయహస్తం లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు వేగంగా జరుగుతోంది. ఆరు గ్యారంటీల్లో ఐదు పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రజాపాలనదరఖాస్తుల ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబాలకన్నా దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. గత నెల 28 నుంచి ఈనెల 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా 16 వేల 392 గ్రామాలు, 710 మున్సిపల్ వార్డుల పరిధిలోని కోటి 11 లక్షల 46 వేల 293 కుటుంబాల పరిధిలో ప్రజాపాలన నిర్వహించగా, కోటి 25 లక్షల 84 వేల 383 దరఖాస్తులు అందాయి.
Congress Guarantees Data Entry Process : వీటిలో 5 గ్యారంటీ పథకాల కోసం కోటి 5 లక్షల 91 వేల 636 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులు, భూసమస్యల పరిష్కారం వంటి వాటి కోసం 19 లక్షల 92 వేల 747 వచ్చాయి. ఆరు గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500, రూ.500కు గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, చేయూత ఫించన్లు, గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ పథకంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం, అమరవీరుల కుటుంబాలకు స్థలం కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటికే రైతుబంధు, ఫించన్లు పొందుతున్న లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, ఒక కుటుంబం నుంచి ఒకదరఖాస్తు చాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, ఒక్కో ఇంటి నుంచి రెండు, మూడు దరఖాస్తులు చేయడంతో పాటు ఇప్పటికే లబ్ధి పొందుతున్నవారు కూడా మళ్లీ సమర్పించినట్లు తెలుస్తోంది.
Praja Palana Applications Data Upload : ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంపిక ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి దరఖాస్తుల సమాచారం కంప్యూటరీకరించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సెలవులు రావడంతో రెండ్రోజులుగా ప్రక్రియ నిలిచిపోగా, రెండు, మూడు రోజుల్లో డేటా ఎంట్రీ పూర్తి చేసి పునపరిశీలించి ఖరారు చేయనున్నారు. ఆధార్, తెల్లరేషన్ కార్డునే లబ్ధిదారుల ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆధార్, రేషన్ కార్డును క్రోడీకరించి దరఖాస్తుల్లో సమాచారం నిజమా? కాదా? అని పరిశీలించి అర్హులను ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. త్వరలో క్షేత్రస్థాయి పరిశీలనకు కూడా వివిధ ప్రభుత్వ శాఖలు సిద్ధమవుతున్నాయి.
ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలు - బాధ్యుడైన అధికారి సస్పెండ్
Praja Palana Program in Telangana :ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుల్లోని వివరాలు నిజమా? కాదా? పరిశీలిస్తారు. దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నట్లయితే అవసరమైన వివరాలు కూడా అడిగి అందులో పొందుపరుస్తారు. డేటా ఎంట్రీ, క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామ, వార్డు సభల్లో ప్రదర్శించి, అభ్యంతరాలను స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నట్లయితే వెంటనే తొలగించడంతో పాటు, దరఖాస్తు చేయని అర్హులు ఉన్నట్లయితే వారిని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. తమ దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ప్రభుత్వం, "ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్. గవ్. ఇన్" పేరుతో ప్రత్యేక వెబ్ సైట్‌ను తయారు చేసింది. దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తికాగానే వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు.
Congress Focus on 6 Guarantees Telangana : 5 గ్యారంటీలు ఆశిస్తున్నవారు ఎందరున్నారనే అంచనా స్పష్టం కావడంతో, బడ్జెట్‌పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దరఖాస్తుల ప్రకారం ఏయే పథకానికి ఎంత ఖర్చవుతుందనే వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కొన్ని శాఖలు ప్రాథమిక అంచనాలు సమర్పించినట్లు తెలుస్తోంది. మొదట 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను వచ్చే నెలలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Free Electricity Scheme Telangana :ఈ రెండు పథకాలకు విద్యుత్, గ్యాస్ కంపెనీల వద్ద వివరాలతో లబ్ధిదారులను ఎంపిక చేయడం సులువుగా ఉండటంతో పాటు, మిగతా పథకాలతో పోలిస్తే నిధుల భారం కూడా కొంత తక్కువగా ఉంటుందని సీఎంకు అధికారులు చెప్పినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలు, గ్యాస్ కంపెనీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా కారణంతో నిధుల చెల్లింపు అప్పుడప్పుడు కొంత ఆలస్యమైనా ఇబ్బంది ఉండదని సూచించినట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఆరు గ్యారంటీల్లో వీలైనన్ని అమలు చేసేందుకు అవసరమైన కసరత్తు ప్రభుత్వం చేస్తోంది.
ఉచిత కరెంట్‌కు బకాయిల షాక్ - ఎరక్కపోయి ప్రజాపాలన దరఖాస్తుతో ఇరుక్కుపోయి!
వేగంగా కొనసాగుతున్న ప్రజాపాలన కంప్యూటరీకరణ - తెల్లకాగితాల దరఖాస్తులకు నో ఛాన్స్