Congress Senior Leaders Nominated Posts : అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో పార్టీ అధికారపగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ నేతలు పదవుల కోసం లాబీయింగ్‌ను ముమ్మరం చేశారు. హైదరాబాద్ మహానగర పరిధిలో ఎమ్మెల్యేలుగా ఎవరు గెలవకపోవడంతో ఇక్కడి నుంచి ఒకరిద్దరికి ఎమ్మెల్సీ పదవులతోపాటు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోటీ చేసి ఓటమి చెందిన వారు టికెట్లు దక్కని నాయకులు, టికెట్లు అడగని సీనియర్ నాయకులు కూడా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. టికెట్ దక్కని వారిని బుజ్జగించే తరుణంలో సర్దుబాట్లు చేసేందుకు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు ఏఐసీసీ, పీసీసీ నుంచి చాలా మందికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పదవులు దక్కించుకునేందకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Congress Leaders Nominated Posts :కాంగ్రెస్‌అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు రెండు, ఎమ్మెల్యే కోటా కింద ఒకటి చొప్పున మూడు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. వీటితో పాటు వందకు పైగా వివిధ శాఖల్లో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉండేందుకు వీలుగా మైనార్టీ నాయకుడికి ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలన్న యోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన పలువురు మైనారిటీ నాయకులు దిల్లీలో మకాం వేశారు.
nominated posts in Congress: అయితే ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారికి ఏడాది పాటు ఎలాంటి పదవులు ఇవ్వరాదన్న అధిష్ఠానం నిర్ణయంతో ఏం చేయాలో చాలా మంది నాయకులకు పాలు పోవడం లేదు. అయినప్పటికీ ఓటమి చెందిన ముగ్గురు మైనారిటీ నాయకులు దిల్లీలో అగ్రనేతల చుట్టూ ప్రదక్షణలు చేసినట్లు తెలుస్తోంది. కొందరు హైదరాబాద్ వచ్చేయగా మరికొందరు అక్కడే మకాం వేశారు. అదే విధంగా మాజీ ఎంపీ, ఇటీవల హైదరాబాద్ నగరంలో పోటీ చేసి ఓటమి చెందిన నాయకుడు కూడా దిల్లీలో అగ్రనాయకులను కలుస్తూ ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి నగర శివారు నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలైన నాయకుడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా చేసినట్లయితే పార్టీని బలోపేతం చేస్తానని చెబుతున్నట్లు సమాచారం. మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.