భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం పరాయిదేశంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జి.నిరంజన్ ధ్వజమెత్తారు. సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయం చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఇప్పటి వరకు పాతబస్తీకి ఎవరూ వెళ్లనట్లు.. మొట్టమొదటిసారిగా తానే అక్కడ కాలు మోపినట్లు మాట్లాడటం సరికాదన్నారు.
ఈ సందర్భంగా చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ సద్భావన యాత్ర చేశారని.. ఇందిరాగాంధీ చనిపోయే ముందు పాతబస్తీలో పర్యటించారని ఆయన గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం భాగ్యలక్ష్మి ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టిందన్నారు. పాతబస్తీలో మందిరం, మసీదు రెండూ కాపాడాలనేది కాంగ్రెస్ దృక్పథమని ఆయన స్పష్టం చేశారు. భాగ్యలక్ష్మి ఆలయంపై హిందువులతో పాటు ముస్లింలకూ విశ్వాసం ఉందన్న ఆయన.. మత రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడొద్దని సూచించారు.