Telangana Congress Party Joinings : రాష్ట్ర కాంగ్రెస్‌లో సామాజిక వర్గాల వారీగా గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగుతోంది. జనాభా ప్రాతిపదికన కాకపోయినా కొంచెం అటుఇటుగా అభ్యర్ధులు ఎంపిక ఉండేటట్లు ముందుకు వెళ్లాలని పీసీసీ నిర్ణయించింది. అధికారమే ధ్యేయంగా అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నపీసీసీ జన,ధనబలం కలిగిన నాయకుల కోసం ఆరా తీస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ముందే అభ్యర్ధులను ప్రకటిస్తామన్న కాంగ్రెస్ సామాజిక వర్గాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. సామాజిక వర్గాల వారీగా బీసీలు 48, జనరల్ 23, ఎస్సీలు 17, ఎస్టీలు 11 శాతం లెక్కన జనాభా ఉంది. ఎస్సీలకు 18, ఎస్టీలకు 9 లెక్కన మొత్తం 27 రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా సీట్ల కేటాయింపు పరిశీలిస్తే బీఆర్ఎస్ ఓసీలకు 58, బీసీ లకు 27, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, మైనార్టీలకు 3 లెక్కన సీట్లు కేటాయించారు.
Congress Searching Strong Candidates : కాంగ్రెస్ పొత్తుల్లో 19 స్థానాలు కోల్పోగా....మిగిలిన వందలో ఓసీలకు 41, బీసీలకు 25, ఎస్సీలకు 17, ఎస్టీలకు 10, మైనారిటీలకు 7 లెక్కన అసెంబ్లీ సీట్లు కేటాయించారు. బీజేపీ 119 స్థానాల్లో పోటీచేయగా ఓసీలకు 50, బీసీలకు 33, ఎస్సీలకు 21, ఎస్టీలకు 12, మైనారిటీలకు మూడు లెక్కన కేటాయించింది. మొత్తంగా తక్కువ శాతం జనాభా కలిగిన ఓసీలు ఎక్కువ స్థానాల్లో బరిలో నిలుస్తున్నారని స్పష్టమవుతోంది. రాజకీయ పార్టీలు జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొని గెలిచే సత్తా ఉన్నవారిని బరిలో దించుతున్నాయి.
దాదాపు 50 శాతం జనాభా కలిగిన బీసీలకు ఆ స్థాయిలో సీట్లు కేటాయించాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. 2018లో 25 మంది బీసీలను బరిలో దింపగా ఈసారి అంతకంటే ఎక్కువ సంఖ్యలో పోటీలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార భారాస అభ్యర్ధులను దీటుగా ఎదుర్కొనగలిగే సత్తా ఉన్న బీసీనేతల కోసం పీసీసీ వేట కొనసాగుతోంది.