Congress Screening Committee Meeting Today : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. స్క్రీనింగ్ కమిటీలో (Congress Screening Committee) పాల్గొంటున్న కొందరు నాయకుల తీరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు నేతలు.. ఆశావహులకు సమాచారం ఇస్తుండడంతో.. రహస్యంగా జరగాల్సిన వ్యవహారం బహిర్గతం అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల స్క్రీనింగ్ కమిటీ సమావేశాల తర్వాత.. ఒకరిద్దరు నాయకులు సమావేశంలో జరిగిన విషయాలను బయటకు చెప్పడం, కొందరు ఆశావహులకు అందులో పాల్గొన్న వారు మద్దతు ఇవ్వలేదని తెలియజేయడంతో.. ఆశావహుల నుంచి నాయకులపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం.
Competition For Telangana Congress Tickets : స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ (Muralidharan) కేరళ ఎంపీ కావడంతో.. కొందరు ఆశావహులైతే ఏకంగా కేరళకు వెళ్లి అక్కడ వారి సామాజిక వర్గానికి చెందిన లేక తెలంగాణ పార్టీ నాయకులకు దగ్గరగా ఉన్న నేతల ద్వారా.. మురళీధరన్‌పై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ అనుబంధ విభాగానికి చెందిన ఓ ఛైర్మన్.. తనకు టికెట్ కోసం దిల్లీలో నాలుగైదు రోజులు మకాం వేసినా.. తను చేసిన లాబీయింగ్ ఫలించలేదు. దీంతో ఏకంగా కేరళ వెళ్లి అక్కడ తమ అనుబంధ విభాగానికి చెందిన జాతీయ నాయకుడి ద్వారా మురళీధరన్‌కు చెప్పించుకున్నట్లు సమాచారం.
ఇలా ఎవరికి వారు ఆశావహులు పైరవీలు చేసుకునే పనిలో మునిగి తేలడంతో.. గోప్యంగా జరగాల్సిన అంశాలు బహిర్గతం కావడం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో లాబీయింగ్‌లకు కానీ, ఒత్తిళ్లకు కానీ తలొగ్గొద్దని గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కేట్లు చూడాలని మురళీధరన్‌కు.. రాహుల్ దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
BC MLA Ticket issue in Congress Telangana : బీసీలకు 34 సీట్లు.. రాష్ట్ర నేతల డిమాండ్‌పై ఏఐసీసీ ఫైర్
Telangana Assembly Elections 2023 : స్క్రీనింగ్ కమిటీపై ఒత్తిడి పెరగడం, ముందు జరిగిన సర్వేలపై అనుమానాలు వ్యక్తం కావడం వల్ల.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కొత్త ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో అనుమానాలకు తావులేకుండా ఒత్తిళ్లకు అవకాశం ఇవ్వకుండా.. సరికొత్త విధానంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో అందరూ కూర్చొని.. చర్చించుకుని అభ్యర్థుల ఎంపికపై వాళ్ల వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేసే విధానం ఉండేది. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా మార్పు తెచ్చినట్లు విశ్వసనీయంగా సమాచారం.
సభ్యులు తెలియజేసిన అభిప్రాయాలు.. బయటకు తెలియకుండా ఉండేందుకు ఒక్కొక్కరిని పిలిపించుకుని అభిప్రాయాలను తీసుకుని.. వాటిని అప్పటికప్పుడు రికార్డు చేసుకునేట్లు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, ఇద్దరు సభ్యులు.. రాష్ట్రానికి చెందిన సభ్యులను ఒక్కొక్కరిని పిలిపించుకుని నియోజకవర్గాల వారీగా.. జాబితాలో ఉన్న నాయకులకు చెందిన వారి అభిప్రాయం తీసుకుంటారు.
Congress MLA Tickets in Telangana2023 :దీంతో ఒకరి అభిప్రాయాలు మరొకరికి తెలిసే అవకాశం ఉండకపోవడంతో.. విషయాలు బయటకు పొక్కే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు దిల్లీలో జరగనున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి.. ఛైర్మన్ మురళీధరన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.