తెలంగాణ

telangana

ETV Bharat / state

'హస్తానికి ఓటేస్తే.. హస్తవాసి మారుస్తాం' - ఓటర్లకు ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ సరికొత్త పంథా

పుర ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోడానికి ఆకర్షణీయమైన తాయిలాలను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అవినీతి రహిత, అత్యుత్తమ ప్రజా సేవా కేంద్రాలుగా మున్సిపాలిటీలను తీర్చిదిద్దుతామని స్పష్టం చేసింది. 24 హామీలతో కూడిన 2020 విజన్‌ డాక్యుమెంట్‌ను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ వెల్లడించారు.

Congress release vision 2020 document
కాంగ్రెస్ విజన్ 2020

By

Published : Jan 16, 2020, 8:50 PM IST

సమగ్రమైన రాష్ట్రాభివృద్ధి జరగాలంటే పల్లెలు, పట్టణాలు సమతుల్యంగా అభివృద్ధి చెందాలని భావిస్తున్న కాంగ్రెస్‌ ఆ దిశగా మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. 2020 విజన్‌ డాక్యుమెంట్‌ పేరుతో 24 హామీలతో ఓటర్లను ఆకట్టుకోడానికి ఆకర్షణీయమైన తాయిలాలను ప్రకటించింది. పట్టణాలల్లో అన్ని వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని స్పష్టం చేసింది.

తెల్లరేషన్ కార్డుదారులందరికీ...

తెల్లరేషన్ కార్డుదారులందరికీ.. ఉచిత నల్ల కనెక్షన్‌, మంచి నీటి సరఫరా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత రహదారుల నిర్మాణం, భూగర్భ మురికి నీటి వ్యవస్థ ఏర్పాటు, ఎల్‌ఈడీ విద్యుత్తు దీపాలు, ఇంకుడు గుంతల నిర్మాణంలాంటివి చేపడతామని పీసీసీ వివరించింది.

కాంగ్రెస్ విజన్- 2020

పార్కులు, చెరువుల సుందరీకరణ, బతుకమ్మ ఘాట్ల నిర్మాణం, యువతి యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు, స్వచ్ఛంద సేవా సంస్థల తోడ్పాటుతో మధ్యాహ్నం, రాత్రి రెండు పూటల రూ. 5కే భోజన పథకం అమలు, కూరగాయల విక్రయకేంద్రాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్‌ పేర్కొంది.

కాంగ్రెస్ విజన్- 2020

క్రీడామైదానాలు, జిమ్​లు..

మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మాణం, పరిసరాల పారిశుద్ధ్యంతో పాటు దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక వసతులతో కూడిన ఇండోర్‌ స్టేడియం, విశాలమైన క్రీడామైదానాలు, జిమ్‌లు, రీడింగ్‌ రూమ్‌లు, ఇంటర్నెట్‌ సౌకర్యంతో కూడిన గ్రంథాలయాలు, ఉచిత వైఫై కూడళ్లు ఏర్పాటు చేస్తామని వివరించింది.

కాంగ్రెస్ విజన్- 2020

6 లక్షల ఆర్థిక సాయం..

నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ, ఉపాధి కల్పనా శిబిరాల నిర్వహణ, అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి 100 గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని పేర్కొంది. ప్రతి మున్సిపాలిటీలో జూనియర్‌, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటు, ఆధునిక వసతులతో 100 పడకల ఆసుపత్రి, 108, 104 సర్వీసులను విస్తరించడం, ప్రతి వార్డులో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, రెండు ఉచిత అంబులెన్స్‌ల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేసింది.

కాంగ్రెస్ విజన్- 2020

రేపు డీసీసీ అధ్యక్షుల సమావేశాలు..

తెరాస, భాజపా తీరును ఎండగడుతూ 2020 విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి డాక్యుమెంట్​ వివరాలను వెల్లడించాలని పీసీసీ ఆదేశించింది.

కాంగ్రెస్ విజన్- 2020

ఇవీ చూడండి: 'తెరాస పథకాలను కాంగ్రెస్​ కాపీ కొడుతోంది'

ABOUT THE AUTHOR

...view details