రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ గురువారం అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం రాత్రి గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు అత్యవసర సమావేశమయ్యారు. రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కుంతియాతో పాటు 20 మందికిపైగా సీనియర్ నాయకులు సమావేశానికి హాజరయ్యారు.
'గెలిచిన అభ్యర్థులు ఫిరాయిస్తే... అఫిడవిట్ తీసుకోవాల్సిందే' - మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ
సెలక్ట్-ఎలక్ట్ పద్ధతిలో రేపు మధ్యాహ్నంలోపు స్థానికంగానే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గెలిచిన తర్వాత ఫిరాయింపులను అరికట్టడానికి... బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి అఫిడవిట్‌లు తీసుకోనుంది. నామినేషన్ల స్క్రుటినీ పూర్తైన తరువాత అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, రిజర్వేషన్లు, అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో కమిటీ ఇచ్చిన నివేదిక, ప్రచారం, ఫిరాయింపులు తదితర అంశాలపై చర్చించారు. స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపికపై చర్చించాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. సెలక్ట్-ఎలక్ట్ పద్ధతిలో గెలుపునే ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తే... క్రిమినల్ చర్యలు తీసుకోడానికి అవకాశం కల్పించేందుకు వీలుగా... అభ్యర్థుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కొందరు నాయకులను ప్రచారతారలుగా నియమించనున్నారు.
ఇవీ చూడండి: పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ ఇవ్వాలి: ఉత్తమ్