Congress Public Meeting in Kollapur Postponed :నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ సభ వాయిదా పడింది. ఈ నెల 20న జరగాల్సిన సభను మరొక రోజు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ఇతర పార్టీల నాయకులు ప్రియాంక గాంధీ సమక్షంలో.. హస్తం పార్టీలో చేరేందుకు పాలమూరు ప్రజాభేరి పేరున సభ నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. అయితే పాలమూరు సభకు ఆహ్వానిస్తూ.. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈ నెల మొదటి వారంలోనే పీసీసీ లేఖ రాసింది.
కానీ ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాలేదు. దీంతో సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 20న సభ నిర్వహించేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో ఓ కమిటీని పీసీసీ వేసింది. అదేవిధంగా సభ నిర్వహణతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి జన సమీకరణ చేసేందుకు ఇంఛార్జ్‌లను కూడా నియమించింది.
Congress Party Meeting In Kollapur : ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో.. సభ వాయిదా పడినట్లు ఏఐసీసీ నుంచి పీసీసీకి, ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 23న కానీ, 28న కానీ, 30న కానీ ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు సభ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఏఐసీసీ సూచించినట్లు సమాచారం. అప్పటికి ప్రియాంక గాంధీ పర్యటన ఖరారు కాకపోయినట్లయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. తెలంగాణ పర్యటనకు రావడం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.