కాంగ్రెస్ చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు.. హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్ నుంచి ప్రదర్శనగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెప్పటంతో.... రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉద్రిక్తతకు దారి తీసిన కాంగ్రెస్ రాజ్‌భవన్ ముట్టడి - కాంగ్రెస్ తాజా వార్తలు
కాంగ్రెస్ చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని భగ్నం చేశారు. లుంబినీ పార్కు, రాజ్‌భవన్‌ల వద్ద పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అరెస్టు చేశారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల జీవనాధారాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సాగు చట్టాలతో ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. 2 నెలలుగా చలిని లెక్క చేయకుండా రైతులు ఉద్యమం చేస్తుంటే ప్రధాని పట్టించుకోవట్లేదని విమర్శించారు. రైతులకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందని తెలిపారు. సాగు చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 170 మందికిపైగా కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయగా..... రైతులకు తీవ్ర నష్టం కలిగించే సాగు చట్టాలు రద్దు చేసేవరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.