Congress preparations for Lok Sabha Polls 2024 : అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేలా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజక వర్గాల వారీగా రాజకీయ పరిస్థితిని తెలుసుకుంటున్న హస్తం(Congress) పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ నియోజక వర్గాలవారీగా మంత్రులు, సీనియర్ నేతలని ఇంఛార్జీలుగా నియమించగా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతూ పార్టీ బలాబలాలపై వివరాలు సేకరిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల శాతం ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఇతర పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం ఎంతనే వివరాలు సేకరిస్తున్నారు. ఎలా ముందుకెళ్తే పార్టీకి ఓటింగ్ శాతం పెరుగుతుందన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు.
Lok Sabha Polls 2024 :రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసి పారదర్శకతతో ముందుకెళ్లాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. పదేళ్లలో ప్రభుత్వ పథకాల అమలు, వాటి వల్ల ఎవరికీ లబ్ధి చేకూర్చాయో జనంలోకి తీసుకెళ్లెగలిగితే బలోపేతం కావడం ఖాయమని అంచనా వేస్తోంది.
నియోజకవర్గాల వారీగా ఆసక్తి చూపుతున్న వారి జాబితాతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్లమెంట్(Lok Sabha Polls) నుంచి పోటీ చేసేందుకు అవకాశమిస్తామని హామీ ఇచ్చిన నాయకుల పేర్లతో జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజక వర్గం నుంచి కనీసం నలుగురైదుగురు పేర్లు జాబితాలో ఉండేలా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంటు దాడి ఘటనపై విచారణ చేయాలని కోరితే సస్పెండ్ చేస్తారా : భట్టి విక్రమార్క