Congress PEC Meeting at Gandhi Bhavan :కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు, పీఈసీ ఛైర్మన్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన.. గాంధీభవన్లో జరిగిన ఎలక్షన్ కమిటీ రెండో సమావేశం ముగిసింది. (Congress PEC Meeting at Gandhi Bhavan). ఇందులో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. మరోవైపు ఈ భేటీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, గీతారెడ్డి గైర్హాజరయ్యారు.
అభ్యర్థుల ఎంపికపై ఎన్నికల కమిటీ ప్రాథమిక కసరత్తు చేసింది. నియోజకవర్గాల వారీగా ఆశావాహులకు ప్రాధాన్యతా సంఖ్యలు కేటాయించింది. మరోవైపు టికెట్ల కోసం.. ఎన్నికల కమిటీలోని సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. తమకే తొలి ప్రాధాన్యత సంఖ్య ఇవ్వాలని పలువురు సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యత ఓటు కోసం నేతలు మిగతా వారి మద్దతు కోరుతున్నారు. సమావేశం అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
Revanth Reddy on Selection MLA Candidates : ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జాబితాను.. సీల్డ్ కవర్లో స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌లోనే ఉంటుందని చెప్పారు. సోమవారం పీఈసీ సభ్యులతో వేర్వేరుగా.. స్రీనింగ్ కమిటీ సమావేశమై అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు వివరించారు. ఎల్లుండి డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయి.. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని వివరించారు.
ఈ క్రమంలోనే ఈ నెల 6న ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశమై.. పీఈసీ ఇచ్చిన నివేదికపై క్షుణ్నంగా అధ్యయనం చేస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. అనంతరం ఈ కమిటీ తయారు చేసిన జాబితాను.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిస్తుందని చెప్పారు. మరోవైపు వీలైనంత త్వరగా మొదటి జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని.. కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే జాబితానే ఫైనల్ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
అప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనకు కూడా సమాచారం ఉండదని రేవంత్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థుల ఎంపిక (Revanth Reddy on Selection MLA Candidates)పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఈసారి అభ్యర్థుల్లో బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయబోతున్నామని చెప్పారు. స్థానిక పరిస్థితులు, సామాజిక వర్గాలను ఆధారం చేసుకొని.. వారిని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఇందులో ఎవరు ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.