Congress warangal Declaration: వరంగల్ రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించిన 9 అంశాలతో కూడిన వరంగల్ డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ నిర్ణయించింది. గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలోప్రధానంగా వరంగల్ రైతు డిక్లరేషన్, ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్ నిర్ణయాలను అభినందిస్తూ ఆమోదించింది. వరంగల్ డిక్లరేషన్‌లోని అంశాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను పీసీసీ సిద్ధం చేసింది. 400మంది కాంగ్రెస్ నాయకులను ఇందుకోసం రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
వరంగల్ రైతు డిక్లరేషన్‌పై అంతగా చర్చ జరగకూడదనే తెరాస, భాజపాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జాతీయ స్థాయిలో భాజపా.. రాష్ట్ర స్థాయిలో తెరాస... మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ లబ్ధి పొందుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది దేశ, రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమన్నారు. కాంగ్రెస్ విధానాలను ప్రజలకు వివరిస్తూనే ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందాన్ని ఎండగడతామన్నారు.