రిజర్వేషన్ల అంశంపై కేంద్ర సర్కారు తీరును ఎండగట్టేందుకు కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల రిజర్వేషన్ల విషయంలో దేశ అత్యున్నత న్యాయ స్థానం చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇదే అంశాన్ని రాజకీయ అనుకూలమైన అంశంగా హస్తం పార్టీ మలచుకుంటోంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ దేశాన్ని విభజించు పాలించు అనే సిద్ధాంతానికి అనుగుణంగా పౌరసత్వ సవరణ చట్టం తెచ్చిందని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తున్నారు హస్తం నేతలు.
కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ మోదీ సర్కార్‌ని ఆలోచనలో పడేసే పరిస్థితిని తెచ్చింది. తాజాగా టీపీసీసీ ముఖ్య నేతలు అత్యవసరంగా బుధవారం గాంధీ భవన్లో సమావేశమయ్యారు. రిజర్వేషన్ల వ్యవహారంపై కేంద్రానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు, నిరసనలు కార్యక్రమలు చేపట్టాలి అనే అంశమే ప్రధాన ఎజెండాగా చర్చించారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలను కలుపుకుని ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించారు. ఈనెల 16న ఇందిరాపార్కు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.
పార్టీ పరంగా ఏ కార్యక్రమనికి పిలుపునిచ్చినా సాధ్యమైనంత ఎక్కువ మంది అందులో పాల్గొనాలని స్పష్టం చేసిన టీపీసీసీ... పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది.
ఇవీ చూడండి:పనివాళ్లుగా చేరారు... ఇళ్లను కొల్లగొట్టారు...