కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో జనజాగరణ యాత్ర చేపట్టనున్నట్లు పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కీ (Madhuyashki) స్పష్టం చేశారు. నవంబర్ 14 నుంచి 21 వరకు రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తారని వెల్లడించారు. కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగటం బాధాకరమని మధుయాష్కీ అన్నారు. ఈ ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమైక్య రాష్ట్రం తన విధానమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మధుయాష్కీ వివరణ ఇచ్చారు.
'కోటి ఎకరాల మాగాణం తెలంగాణం అనే నినాదం తెలుపుతూ... ఇవాళ వరి వేసుకోవద్దు.. వరి వేసుకుంటే ఉరి అనే విధంగా మాట్లాడుతున్న తెరాస విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 14 నుంచి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేపట్టబోతోంది. పార్టీలోని అగ్రనాయకులు వారం రోజుల పాటు సాగే యాత్రలో రోజు 10 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర నిర్వహిస్తారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌పై జగ్గారెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధంలేదు.'