తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రగతిభవన్​ ముట్టడి... అరెస్టులు, నిర్బంధాలతో కట్టడి... - రేవంత్ రెడ్డి అరెస్టు

భారీగా బలగాల మోహరింపు... గృహనిర్బంధాలు... అరెస్టులు... పోలీసుల కన్ను కప్పేందుకు నేతల యత్నాలు... ఖాకీల పరుగులు... ప్రగతిభవన్‌ ముట్టడి కార్యక్రమంలో కన్పించిన దృశ్యాలు. ఆద్యంతం ఉరుకులు పరుగులతో నాటకీయంగా నడిచిన ధర్నాలో... కాంగ్రెస్‌ నేతలను కట్టడి చేయడం పోలీసులకు కష్టతరమైంది. విడతల వారీగా వచ్చిన నేతలను ప్రగతిభవన్‌కు చేరుకోకుండా అడ్డుకునేందుకు నానా తంటాలు పడ్డారు.

CONGRESS PARTY PRAGATHI BHAVAN MUTTADI OVERALL STORY

By

Published : Oct 21, 2019, 10:14 PM IST

ప్రగతిభవన్​ ముట్టడి... అరెస్టులు, నిర్బంధాలతో కట్టడి...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన ప్రగతి భవన్‌ ముట్టడి ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠగా సాగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రగతిభవన్‌ వద్దకు వెళ్లి తీరాలని నేతలు ముందే వ్యూహరచన చేసుకున్నారు. ఇటు పోలీసు శాఖ కూడా అప్రమత్తమై... హస్తం​ నేతల ఇళ్ల వద్ద అర్ధరాత్రి నుంచే బలగాలను మోహరించారు. ప్రగతి భవన్‌కు వచ్చే అన్ని దారులను మూసేసింది. చివరకు మెట్రో రైలు కూడా ఆ స్టేషన్‌లో ఆగకుండా చర్యలు తీసుకున్నారు.

ఆది నుంచే అరెస్టుల పర్వం...

ఉదయం మొదలైన కాంగ్రెస్‌ నేతల అరెస్టుల పరంపర మధ్యాహ్నం వరకు కొనసాగింది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డితో సహా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను గృహనిర్బంధంలో ఉంచిన పోలీసులు బయటకు రాగానే అదుపులోకి తీసుకుని కొద్దిసేపు అటూ ఇటూ తిప్పి తిరిగి ఇంటిలోనే బంధించారు.

బైక్​ మీద వెళ్లినా... ఆటోలో వెళ్లినా అరెస్టే..!

ఎంపీ రేవంత్‌ రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచినా... పోలీసు వలయాన్ని చేధించుకుని ద్విచక్రవాహనంపై ప్రగతిభవన్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ రేవంత్​ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కొద్దిసేపు బాహ్యవలయ రహదారిపై తిప్పి... చివరకు కామాటిపుర ఠాణాకు తరలించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సామాన్య పౌరుడి మాదిరి ఆటోలో ప్రగతి భవన్‌ వచ్చేందుకు యత్నించగా... పంజాగుట్ట వద్దకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీభవన్‌ నుంచి ప్రగతిభవన్‌కు బయలు దేరిన పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పీసీసీ అధికార ప్రతినిధులు సునీతారావ్‌, సతీష్‌ మాదిగ, నిజాంలను అరెస్ట్‌ చేశారు. మాజీ ఎంపీ అంజనికుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ రాముల్​నాయక్‌, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ తదితరులను ప్రగతిభవన్​ పరిసరాల్లో అరెస్ట్‌ చేశారు. ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్‌ నుంచి కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ను అదుపులోకి తీసుకున్నారు.

గృహనిర్బంధాలు... ఇనుపకంచెలు...

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌బాబు, జానా రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్థన్‌ రెడ్డి, మల్​రెడ్డి రంగారెడ్డి తదితరులను గృహనిర్బంధంలో ఉంచారు.
కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి నుంచి దాదాపు 50 మంది నేతలు ముట్టడికి ప్రారంభం కాగా... ఇనుప కంచెలు వేసి అడ్డుకున్నారు. పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినా... గృహనిర్బంధాల్లో ఉంచినా... కొందరు నాయకులు ప్రగతిభవన్‌ వరకు వచ్చి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు.

అరెస్టులతోనే విజయవంతం...

అన్ని దారులు మూసేసి ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేయటంతోనే తమ ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అభిప్రాయపడ్డారు. నేతలందరూ ప్రగతిభవన్‌ వద్దకు వెళ్లలేకపోయినా... తాము అనుకున్నట్లుగా భారీగా ప్రచారం జరిగి... ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లైయిందని పేర్కొన్నారు.

ఇవీచూడండి: జీతాల చెల్లింపునకు నిధుల్లేవు: ఆర్టీసీ యాజమాన్యం

ABOUT THE AUTHOR

...view details