తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్ ప్రసంగంపై మాట్లాడేందుకు ఏముంది: భట్టి

Congress on Telangana Assembly Sessions: సమస్యలు, చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నందున బడ్జెట్‌ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీఏసీ సమావేశంలో స్పీకర్​ని కోరారు. మరోవైపు అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగంపై భట్టితో సహా పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బయట పులిలా గర్జించిన గవర్నర్... అసెంబ్లీలో పిల్లిలా ప్రసంగించారని ఆరోపించారు.

Congress
Congress

By

Published : Feb 3, 2023, 6:05 PM IST

Updated : Feb 3, 2023, 7:45 PM IST

Congress on Telangana Assembly Sessions: అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన సమస్యలు, అంశాలు ఎక్కువగా ఉన్నందున బడ్జెట్‌ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పీకర్​ను కోరారు. కనీసం 25 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. సభలో 20 ప్రజా అంశాలపై చర్చించేందుకు అవకాశం కల్పించాలని స్పీకర్​ను కోరారు. పంట రుణాలు, దళిత బంధు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతు ఆత్మహత్యలు, శాంతి భద్రతలు, ఫీజు రీయింబర్స్​మెంట్, పెట్రోల్, డీజిల్​పై రాష్ట్ర ప్రభుత్వం పన్ను, పోడు భూములకు పట్టాలు, సర్పంచ్​లకు నిధుల విడుదల, విభజన చట్టం అమలు, సీపీఎస్ విధానం తదితర అంశాలు ఉన్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రసంగంలో వ్యాఖ్యానించేందుకు ఏమి లేదు:కాంగ్రెస్‌ శాసనసభ్యులకు సరిగా ప్రొటోకాల్‌ ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క ప్రస్తావించారు. కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ నిర్మాణం అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. బడ్జెట్​పై 6 రోజులు, డిమాండ్లపై 18 రోజులు చర్చ జరగాలని.. అప్పుడే సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. బీఏసీలో ప్రతిపక్షాలందరినీ పిలిస్తే బాగుండేదని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో వ్యాఖ్యానించేందుకు ఏమి లేదని, సాదాసీదాగా ఆమె ప్రసంగం ఉందని వ్యాఖ్యానించారు.

అలా ఉండకపోతే గవర్నర్‌ మైక్‌ కట్‌ అవుతుంది:గవర్నర్ తమిళిసై తప్పనిసరి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్​తో రాజీ పడ్డారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బయట పులిలా గర్జించిన గవర్నర్... అసెంబ్లీలో పిల్లిలా ప్రసంగించారని ఆయన వ్యాఖ్యానించారు. అలా గవర్నర్ మాట్లాడకపోతే ఆమె మైక్ కూడా కట్ అవుతుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో కనబడాలి ఆనుకున్నారు... కనిపించారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్​లోనే.. గవర్నర్ నడిచారంటూ జగ్గారెడ్డి తప్పుబట్టారు. బీజేపీ, బీఆర్ఎస్​లో 'బీ' ఉందని, గవర్నర్ మూడో 'బీ' అని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

ప్రసంగమంతా అబద్ధాలతో నిండి ఉంది: గవర్నర్‌ ప్రసంగమంతా అబద్ధాలతో నిండి ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఇలాంటి ప్రసంగం చేయాల్సి రావడం దురదృష్టకరం అన్నారు. గవర్నర్‌ స్వేచ్ఛగా వ్యక్తిగత అభిప్రాయం చెప్పే అవకాశం కోల్పోయారని జీవన్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడో పోతుందో విద్యుత్‌ శాఖ అధికారులకే తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. దేశంలో పంటల బీమా పథకం అమలు చేయని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. దళిత బంధు పేరుతో భారాస ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని ఆరోపించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 3, 2023, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details