తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Party on Decade Celebrations : 'అవి దశాబ్ది దగా ఉత్సవాలు.. 22న పెద్దఎత్తున నిరసనలు' - తెలంగాణ తాజా వార్తలు

Revanth Reddy Fires On Telangana Decade Celebrations : దశాబ్ది ఉత్సవాలను బీఆర్​ఎస్ సొంత వ్యవహారంలా నిర్వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అవి దశాబ్ది ఉత్సవాలు కాదని.. దశాబ్ది దగా ఉత్సవాలని ధ్వజమెత్తింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు, దిష్టిబొమ్మలు దగ్ధం చెయ్యాలని నిర్ణయించింది. భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు దృష్ట్యా ఖమ్మంలో భారీ సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్​కు లేదన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఊహాగానాలు వద్దని మీడియాకు సూచించారు.

Congress Party on Decade Celebrations
Congress Party on Decade Celebrations

By

Published : Jun 18, 2023, 9:56 AM IST

Revanth Reddy Fires on BRS Government : తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. ప్రజల సొమ్ముతో దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ సొంత వ్యవహారంలాచేస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాలు ప్రజలకు అసౌకర్యంగా మారాయని ఆరోపించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులందరూ బీఆర్ఎస్ సేవలో తరించిపోతున్నారని ధ్వజమెత్తారు. గాంధీభవన్​లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. పదేళ్లలో కేసీఆర్ అటకెక్కించిన హామీలను ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లాలని నేతలకు, కార్యకర్తలను రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేసేలా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. చేరికలపై ఊహాగానాలు వద్దన్న రేవంత్.. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నాక.. తామే ప్రకటిస్తామని వెల్లడించారు.

పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్​గా మాజీ మంత్రి షబ్బీర్ అలీ బాధ్యత వహిస్తారని రేవంత్ స్పష్టం చేశారు. మండల కమిటీలకు చాలా ప్రతిపాదనలు వచ్చాయని.. 10 రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న రేవంత్ ఈ నెల 22వ తేదీన 119 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు తీయడంతో పాటు రావణాసురుడి రూపంలో ఉన్న కేసీఆర్ పది వైఫల్యాలతో కూడిన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామని చెప్పారు. ఆర్డీవో కార్యాలయాల్లో కానీ, ఎమ్మార్వో కార్యాలయంలో కానీ వినతిపత్రం అందజేయాలన్నారు.

Revanth Reddy Fires On KCR : పదేళ్లలో కేసీఆర్ అటకెక్కించిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి సూచించారు. కేజీ టూ పీజీ, ఫీజు రీయింబర్స్​మెంట్, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్​రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాలు, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ హామీల విషయంలో తెలంగాణ సర్కార్​ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేసేలా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు.

Discussion on Second Capital Of TS : బీసీ డిక్లరేషన్, మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్​పై చర్చ జరుగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. భట్టి పాదయాత్ర ఈ నెలాఖరులో ముగుస్తుందని, ఆ సందర్భంలో ఖమ్మంలో జాతీయ నాయకులతో ఒక భారీ సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. భట్టితో సంప్రదించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండో రాజధానిపై ప్రతిపాదన వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ తెలిపారు. ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుందా? రాష్ట్రానికి వెళ్తుందా తెలియాలని డిమాండ్ చేశారు. విస్తృతంగా చర్చించిన తరువాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

టీఎస్​పీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలను సమీక్ష చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు. టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని ఆరోపించారు. పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామన్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది అని వ్యాఖ్యానించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని.. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details