రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో ఐఖ్యత కొరవడింది. ఏకతాటిపై ఉండి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిన వీరు... అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు. ఏఐసీసీ పిలుపుమేర చేసే కార్యక్రమాలకు సైతం... కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి ఆశించిన మేర స్పందన ఉండడంలేదు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే పిలుపులను పరిగణలోకి తీసుకోవట్లేదనే ఊహగానాలు సైతం వినిపిస్తున్నాయి.
దామోదర్ X దయాకర్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గంలో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన అద్దంకి దయాకర్ వర్గానికి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు చోటు చేసుకున్నాయి. దామోదర్ రెడ్డి తరచూ తమను బెదిరిస్తున్నాడని... సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు దయాకర్ ఫిర్యాదు చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని సుల్తాన్ బజారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సొంత నిర్ణయాలు..
ఈ ఘటనతో వారి మధ్య ఉన్న విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. వాస్తవానికి ఇలాంటి బేధాలు వచ్చినప్పుడు... పీసీసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. కానీ అద్దంకి దయాకర్ మాత్రం తనదైన శైలిలో ముందుకెళ్లి... దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఈ విషయమై క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కోదండ్ రెడ్డి రంగంలోకి దిగారు. భట్టి విక్రమార్కతో సమావేశమై లోతైన చర్చ చేశారు. విభేదాలు ఉంటే... పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలే కానీ.. ఇలా కేసులు పెట్టడం ఏంటని నిలదీసినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేలా పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది.