Congress PAC Meeting in Telangana :ఎన్నికల తేదీల ప్రకటన వెలువడటంతో కాంగ్రెస్ పార్టీ త్వరితగతిన పావులు కదుపుతూ.. ముందుకు సాగుతుంది. దీనిలో భాగంగానే మంగళవారం సాయంత్రం గాంధీ భవన్లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరపనుంది. పీఏసీ(Political Action Committee) సమావేశంలో పార్టీ ప్రచార ప్రణాళికలు చేయనున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర కమిటీ సభ్యులు పాల్గొంటారు.
Telangana Congress Bus Yatra 2023 :ఈ నెల 15 వ తేదీ నుంచి మొదలవనున్న బస్సు యాత్ర.. విధివిధానాలు , పార్టీ అగ్రనాయకుల పర్యటన, తాజా రాజకీయాలపై చర్చ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తిరగబడదాం-తరిమికొడదాం అనే నినాదంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లనుంది. నాయకుల ఐక్యత చాటేందుకు ఈ బస్సు యాత్ర దోహదం చేస్తుందని పీసీసీ భావిస్తోంది. 15వ తేదీన అలంపూర్ నుంచి బస్సు యాత్రను ప్రియాంక గాంధీ ప్రారంభించి.. ప్రచారాన్ని మొదలు పెడతారు.
రెండు రోజులు బస్సు యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. భారత్ జోడో యాత్ర.. రేవంత్ హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర , భట్టి పాదయాత్రలు కవర్ కానీ ప్రాంతాలకు బస్సు యాత్రలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన రైతు, యువ, ఎస్సీ.. ఎస్టీ డిక్లరేషన్లు, చేయూత పెన్షన్ పథకం , ఆరు గ్యారెంటీ కార్డులతో కాంగ్రెస్ ప్రజలోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపకల్పన చేయనుంది. ఈ నెల 18, 19 తేదీలలో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొననున్నారు.