Congress On MLA Quota MLC Elections in Telangana : రాష్ట్రంలో శాసనసభ సభ్యుల కోటా అభ్యర్ధుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఆచీతూచీ అడుగులు వేస్తోంది. శనివారం రాత్రి పార్టీ అధిష్ఠానంతో చర్చించి, పీసీసీ ఓ నిర్ణయానికి వచ్చినా, ఎంపీ ఎన్నికల్లో పోటీచేసే వారిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు మరింత కసరత్తు చేస్తున్నారు.
పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికై రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీల భర్తీకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఖాళీ అయిన వాటిలో ఒకటి రెడ్డి, మరొకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవైనందున, లాభనష్టాలను అంచనా వేసుకుని అభ్యర్థులను ఎంపిక కసరత్తు చేస్తున్నారు. దగ్గరలో పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో, ఆ ఎన్నికల్లోనూ లబ్ధి చేకూరేట్లు నిర్ణయం ఉండాలని భావిస్తున్నారు.
ఒకటా? రెండా? - ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై గందరగోళం
బీసీ సామాజిక వర్గానికి చెందిన పీసీసీ సంస్థాగత కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌లతో పాటు, సూర్యాపేట టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డి, 2018లోనే ఎమ్మెల్సీ హామీ పొందిన ప్రోటోకాల్ ఛైర్మన్ హర్కర్ వేణుగోపాల్‌లు, శాసనమండలి పదవుల ఆశిస్తున్నారు. వీరిలో ఇద్దరిని పక్కనబెట్టి, ఇప్పటికే ఇద్దరికి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.
శనివారం అధిష్ఠానం వద్ద జరిగిన చర్చల్లో కేసీ వేణుగోపాల్‌తోపాటు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు సమక్షంలో తుదినిర్ణయం జరిగినట్లు సమాచారం. సీఎం దావోస్ వెళ్లగా, ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు ఇద్దరిని అధిష్ఠానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవటం పార్టీలో చర్చనీయంగా మారింది.