Congress Nirudyoga Nirasana Deeksha: నిరుద్యోగ సమస్యలపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాష్ట్రంలో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన దీక్షల తేదీలను పీసీసీ ప్రకటించింది. రేపు నల్గొండలో జరగాల్సిన నిరుద్యోగ నిరసన సభను ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచన మేరకు ఈనెల 28కి వాయిదావేశారు. ఈనెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, మే1న రంగారెడ్డి జిల్లాలో.. నిరుద్యోగ నిరసన సభలు నిర్వహించాలని హస్తం నేతలు నిర్ణయించారు.
మరోవైపు ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని రేణుకా చౌదరి నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఖమ్మంలో జరగనున్న నిరుద్యోగ బహిరంగ సభపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్, గడ్డం ప్రసాద్, సురేశ్ షెట్కార్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఉద్యమాన్ని మరింత కొనసాగించాలని నిర్ణయించింది. ఈనేపథ్యంలోనే విశ్వవిద్యాలయాల్లో నిరుద్యోగ నిరసన దీక్ష సభలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రధానంగా ప్రశ్నపత్రాలు ఏ విధంగా లీక్ అయ్యాయి..? అందుకు బాధ్యులు ఎవరు..? అన్న కోణంలో యువతకు వివరించి.. తద్వారా ఓటర్లను తమవైపు ఆకర్షితులను చేసుకునే దిశలో కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తోంది.
రాష్ట్రానికి ప్రియాంక గాంధీ:ఈ క్రమంలోనే మే 4 లేదా 5న హైదరాబాద్ సరూర్‌నగర్ మైదానంలో భారీ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రియాంక గాంధీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఇందులో భాగంగానే అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపైఇప్పటికే ఆందోళనలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.