Uttam Kumar reddy: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను సర్వ నాశనం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి ఏపీలో పోలీసు వ్యవస్థకు మంచి పేరు ఉండేదని ఆయన తెలిపారు. తెరాస ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు చీత్కరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి తన స్వార్థ ప్రయోజనాలు, దోపిడీ కోసం పోలీసులను వాడుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అనుకూలంగా ఉన్నవారికే పదోన్నతులు ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలకు 20 జిల్లాల్లో ఐపీఎస్‌లకు పోస్టింగ్ ఇవ్వట్లేదని వెల్లడించారు. సమర్థత, నిజాయితీ ఉన్న పోలీసులకు పోస్టింగ్ ఇవ్వట్లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటకతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారన్నారు. గవర్నర్ వ్యవస్థను తెరాస ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. నియోజకవర్గాల్లో కూడా ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇంత వికృతమైన పరిపాలన ఊహించలేదు. కుటుంబపాలన, పోలీసు అధికారుల మాఫీయా నడిపిస్తోంది. పోలీసుల వేధింపులు తాళలేక రామాయంపేటలో ఓ కుటుంబం బలైంది. కేసీఆర్ పాలన పోలీసులు, డబ్బుతో నడుస్తోంది. తెరాసను ప్రజలు బొందపెట్టడం ఖాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు మంచి పేరు ఉండేది. కానీ ఇప్పుడు కేసీఆర్ వల్ల సర్వనాశనమైంది.
- ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ఎంపీ